ప్రజా, కార్మిక, గిరిజన వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
- సిపిఎం రంపచోడవరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పిలుపు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి(రంపచోడవరం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక గిరిజన వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గురువారం రంపచోడవరంలో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు అధ్యక్షతన సిపిఎం రంపచోడవరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అలంబిస్తున్న ప్రజా, కార్మిక, గిరిజన వ్యతిరేక విధానాలు గూర్చి వివరించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న దోపిడీ వ్యవస్థ, దేశంలో జరుగుతున్న పరిణామాలు గురించి, ప్రజలు ఇబ్బందులు, సమస్యలు గూర్చి వివరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి బడా కార్పొరేట్ శక్తులకు ధారాధాత్తం చేస్తున్నాయని విమర్శించారు. బడా కార్పొరేట్ శక్తులైన రిలయన్స్ అంబానీ, ఆధానీలకు లక్షలాది కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి పేద ప్రజలు నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజలు, కార్మికులు, గిరిజనులు సమస్యలపై సిపిఎం నిరంతరం నిస్వార్ధంగా పోరాడుతుందని, ఏజెన్సీలో స్వార్థపూరిత రాజకీయాలు ఎక్కువయ్యాయని, రౌడీ రాజ్యం, రాజ్యమేలుతుందని, పోలీసులు ప్రభుత్వ అధికారుల సైతం వారికే కొమ్ము కాయడం దుర్మార్గమన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేసింది శూన్యమని,పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం నట్టేట ముంచారని, ప్రశ్నించాల్సిన ఈ ప్రాంత ఎమ్మెల్యే నోరు మెదపడం లేదని, గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే విధంగా బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ రెండవసారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దుర్మార్గమని దీనిని వ్యతిరేకించాల్సిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వానికి వత్తాసు పలకడం అన్యాయమని ఇటువంటి వారిని గిరిజన ప్రాంతవాసులు నిలదీయాలని, అవకాశవాద రాజకీయాలని ఎండగట్టాలని, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టిన,ఎన్ని నిర్బంధాలు విధించిన, భయాందోళనకు గురిచేసిన సరే సిపిఎం భయపడేదిలేదని, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని సిపిఎంకు ప్రజలు, కార్మికులు, గిరిజనులు అండగా నిలవాలని, సిపిఎం పోరాటాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వరరావు, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వాణిశ్రీ, పి వెంకట్, గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా అధ్యక్షులు ఈ సిరిమల్లి రెడ్డి, 11 మండలాల నాయకులు కె సూరిబాబు, కె జగన్నాథం, టి శ్రీను, కె చల్లయమ్మ, రామలక్ష్మి, రమణమ్మ, ఎం రమేష్ పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యులు పాల్గొన్నారు.










