Feb 17,2023 21:59

ఫొటో : పంట పొలాలు పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత అవసరం
ప్రజాశక్తి-అల్లూరు : వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత చాలా ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం మండలంలోని ఇందుపూరు సమీపంలోని అన్నదాత శ్రీనివాసులుకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక (డాట్‌ సెంటర్‌) కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రైతులకు అనేక సలహాలు సూచనలు అందజేసి రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రీడర్‌ శ్రీ లక్ష్మీ, దేశీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ విశ్రాంత ఎడి రమణయ్య, డాట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ ఓబయ్య, ఎండమాలజిస్ట్‌ సురేఖ మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో వాడరాదని హితవు పలికారు. రైతులు వ్యవసాయంలో అనేక మెళకువలు పాటించాలని తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
వరిపై సోకే తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి పురుగు మందును పిచికారి చేయాలని కోరారు. కొంతమంది అవగాహన లేకుండా అధిక మోతాదులో పురుగు మందులు వాడకం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులకు తెలియజేశారు. అన్నదాత శాస్త్రవేత్తల సహకారంతో బిపిటిలు 3082, 2846, 5204, ఎన్‌ఎల్‌ఆర్‌ 3418, 145, ఎంటియు 1224, 1061, 1318, 1282, 1262, 1271, ఎంసిఎం 125, కెఎన్‌ఎం 733, ఐఐఆర్‌ఆర్‌ 93, నవార్‌ రకాల వరి పంటలను వేసి నూతన వరవడికి శ్రీకారం చుట్టారన్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రత్యమ్నాయ పంటలపై మొగ్గు చూపుతున్నందుకు అభినందించారు. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చునన్నారు. కార్యక్రమంలో మిలటరీ శ్రీనివాసులరెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులున్నారు.