ఏప్రిల్ 9, 10 కన్నూర్ వెళ్ళాం. సిపిఎం అఖిల భారత మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూశాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక ఇల్లు, ఇంటి చుట్టూ అనేక పండ్ల చెట్లు, పూల మొక్కలు, పంట కాలువలు, వరి పంట పొలాలు ఏర్పాటు చేశారు. వరి పంటకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపించింది. ఆ రాష్ట్రమంతా కొండలు, అటవీ ప్రాంతం, సముద్రతీర ప్రాంతం ఎక్కువగా ఉన్నట్లు గమనించాను. వరి పండించడానికి తగిన భూములు అక్కడ అందుబాటులో లేవు. సుగంధ ద్రవ్యాలు, ఇతర వాణిజ్య పంటలకు అనువైన భూములుగా ఉన్నాయి. ఇలాంటి భూములను వరి పండించే భూములుగా మార్చడం కష్టమే. అయితే మన రాష్ట్రంలో వరి పండే భూములను ఆక్వా చెరువులుగా ఇతర వాణిజ్య పంటలు పండే భూములుగా మారుస్తున్నారు. మన ప్రభుత్వం వరికి ప్రాధాన్యతను రోజు రోజుకీ తగ్గించి వేస్తోంది. ఫలితంగా మన వరి రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేరళ వామపక్ష ప్రభుత్వం వరి పంటకు అధిక ప్రాధాన్యత ఇస్తూ...కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా... రైతుకు దాదాపు రూ.800 ఇచ్చి కొనుగోలు చేస్తోంది.
ఆదర్శవంతమైన సహకార వ్యవస్థ
కేరళ రాష్ట్రంలో దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన సహకార వ్యవస్థ నడుస్తున్నట్లుగా గమనించాను. మన రాష్ట్రంలో సహకార సంఘాలను పరిశీలిస్తే వ్యాపార దృక్పథం మనకు కనిపిస్తుంది. అయితే అక్కడ సహకార వ్యవస్థ అట్లా లేదు. మేము కోజికోడ్ బీచ్ సమీపంలో కేరళ స్టేట్ కాఫీ సహకార సొసైటీ హోటల్లోకి వెళ్ళాం. బయట హోటళ్లతో పోలిస్తే అక్కడి రేట్లు చాలా తక్కువగా కనిపించాయి. అక్కడ పండే పంటలను సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. వివిధ పంటలను వివిధ రకాల ఆహార ఉత్పత్తులుగా మార్చి మార్కెటింగ్ చేయడం ద్వారా సహకార సంఘాల వ్యవస్థ బలోపేతంగా ఉంది. రైతులకు మేలు జరుగుతున్నది.
ప్లాస్టిక్ వాడకం లేదు
కిరణా షాప్ లోకి వెళ్లి కొన్ని అవసరమైన సరుకులు కొన్నాను. కాగితం కవర్‌లో పెట్టి ఇచ్చారు. నేను ప్లాస్టిక్ కవర్ అడిగాను. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు నిషేధం అని షాపు యజమాని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు లేవు. అక్కడ పర్యావరణం పరిరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమైంది. భోజనాలు కూడా అరిటాకులలోనే పెడుతున్నారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా తక్కువే. అభివృద్ధికి నమూనాగా కేరళ ఆదర్శంగా ఉందనిపించింది.
- కె.శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, సెల్: 9490098574










