Mar 26,2023 21:21

వట్టి పసుపు తయారీ పనులు ముమ్మరం

ప్రజాశక్తి-చాపాడు
రైతు బంగారంగా పేర్కొంటున్న పసుపు పంట నూర్పిడిని పూర్తి చేసిన రైతున్నలు వట్టి పసుపుగా మార్చేందుకు పనులు ముమ్మరం చేశారు. పసుపు పంటను ఉడికించేందుకు కూలీలు, సామగ్రి, ఇందన ఖర్చులు అధికమవ్వడంతో ఈ ఏడాది రైతులు అధికంగా యంత్రాలను ఉపయోగిస్తున్నారు. యంత్రం ద్వారా ఒకే సారి మూడు పుట్ల వరకు పచ్చి పసుపును ఉడికించే వెసలుబాటు ఉంటుందని తద్వారా పని సులభం అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. యంత్రానికి ఒక రౌండ్‌కు రూ.700 బాడుగ చెల్లించాల్సి వస్తుంది.. వేడి చేసేందుకు కావాల్సిన కలప, రబ్బర్‌ టైర్లు మాత్రం రైతులు సమకూర్చాల్సి ఉంది. యంత్రం ద్వారా ఉడికించిన పసుపు త్వరగా ఎండు పసుపుగా మారుతుందని రైతులు చెబతున్నారు. గతంలో ఎకరా పోలంలోని పసుపును ఉడికించేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం యంత్రం ద్వారా 4గంటలలోనే పూర్తి అవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఎండు పసుపుకు గిట్టుబాటు ధర ప్రస్తుతం రూ.6850 మాత్రమే ఉందని రైతులు దిగాలు చెందుతున్నారు. పచ్చి పసుపు ధరలు మరి దయనీయంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టి పసుపు ధర కేవలం రూ.5వేలు మాత్రమే పలుకుతున్నాయని రైతులు వట్టి పసుపుగా మార్చేందుకే ఇష్టపడుతున్నారు. గిట్టుబాటు ధర ప్రస్తుతం ఉన్న దిగుబడికి క్వింటా రూ.10వేలకు పైగా నిర్ణయించాలని కొరుతున్నారు. ఈ ఏడాది దిగుబడి కూడా నామమాత్రంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. మండల పరిధిలో సుమారుగా 160 హెక్టార్లలో పసుపు పంటను రైతులు సాగుచేశారు. చాపాడు, సీతారామాపురం, అల్లాడుపల్లె, చిన్నగురువలూరు, పెద్దగురు వలూరు, లక్ష్మీపేట, కేతవరం గ్రామాల పరిధిలో పసుపు పంటను ఉడకబెడుతున్నారు. ఎకరాకు 25 పుట్ల వరకు దిగుబడి వస్తున్నది. పసుపు పంట సాగుకు ఎకరాకు రూ.70వేల నుండి రూ.1లక్ష వరకు ఖర్చులు అయ్యాయని రైతులు వాపోయారు. ఎడాది పంట కావడంతో విత్తనం కొనుగోలు దగ్గర నుండి సాగు, కూలీలు, ఎరువులు, మందులు కలిపి అధికంగా ఖర్చులు అవుతున్నాయని వారు చెబుతున్నారు. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, బి.మఠం మండలాల్లో 800 హెక్టార్లలో పసుపు పంటను రైతులు సాగుచేశారు. మైదుకూరు మండలంలో సాగైన 420హెక్టార్లలోని పసుపు పంటను రైతులు విత్తన పసుపుకోసం దుక్కిళ్ళు సాగించలేదు. ఏప్రిల్‌ చివరి వారంలో, మే నెలల్లో దుక్కిళ్ళు సాగిస్తారు. పసుపు ధరలు కడప మార్కేట్‌లో కంటే మహరాష్ట్ర శాంగ్లీ మార్కేట్‌లో రూ.వెయ్యి ఎక్కువగా ధరలు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.