ప్రజాశక్తి-గుంటూరు : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరులో నేడు చేపట్టదలచిన శాంతి ర్యాలీ అనుమతి నిరాకరణపై రాష్ట్ర డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శాంతి ర్యాలీలు చేపట్టేందుకు అనుమతులివ్వకపోవడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. శాంతి నిరసనలు చేపట్టేందుకు కూడా ప్రజలకు హక్కు లేదా అని ప్రశ్నించారు. శాంతి ర్యాలీలకు సైతం అనుమతులు నిరాకరించడం చూస్తుంటే వలసవాద పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని తెలిపారు. శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం రాజ్యాంగంలోని పార్ట్–3లో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను నిరాకరించడమేనని వెల్లడించారు. రాష్ట్రంలో వలసవాద పాలన నాటి పోలీసు రాజ్యం నడుస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు భారత రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కు లేదా అని ప్రశ్నించారు. స్వేచ్చగా శాంతియుతంగా మీటింగ్ కూడా పెట్టుకోకూడదా అని ఆగ్రహించారు. ఇప్పటికైనా డీజీపీ కలుగజేసుకుని ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులు రాష్ట్రంలో అమలయ్యేలా చూడాలని, గుంటూరు శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని కోరారు.










