ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలీస్ శాఖలో కులవివక్షను అధికార వైసిపి పెంచి పోషిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, పోలీస్ శాఖ తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. అధికార పార్టీ చేతిలో బందీగా మారిందని విమర్శించారు. పోస్టింగులు, ప్రాధాన్యతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో ఒకే కులానికి ప్రధాన స్థానంలో పోస్టింగులు ఇస్తూ మిగిలిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు అప్రాధాన్యత పోస్టింగులు ఇస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి సంఘాలు డిఐజి అమ్మిరెడ్డిని కలిసి పోస్టింగులన్నీ రెడ్డి కులస్తులకే ఇస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టిలను అప్రాధాన్యత పోస్టుల్లో పెడుతున్నారని విన్నవించారని వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రంలో రౌడీలకు పోలీసులు భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. సూళ్లూరుపేటలో దళిత పోలీస్ అధికారి రవిబాబుపై దాడిని ఖండిస్తూ వర్ల రామయ్య డిజిపికి లేఖ రాశారు.










