- 7.5 లక్షల టన్నుల దిగుబడి నష్టం.. అయినా రబీ సాగుపై ఆంక్షలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నవంబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల ఏడెనిమిది లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అన్ని పంటలూ కలుపుకొని పంటల ఉత్పత్తి నష్టం 10.19 లక్షల టన్నులుగా పేర్కొనగా, అందులో అత్యధిక నష్టం వరి ధాన్యానిది. ఖరీఫ్‌లో సాగైన వేరుశనగ, పత్తి, రబీలో వేసిన పప్పుశనగ పంటల దిగుబడికి సైతం గణనీయంగా నష్టం వాటిల్లింది. ఖరీఫ్ పంటలు కోతల మీదున్న సమయంలో గత నెలలో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పంటలను నీటిపాల్జేశాయి. కడప, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లింది. మొత్తంగా 4,88,760 హెక్టార్ల (దాదాపు 12.22 లక్షల ఎకరాలు)లో పంటలు దెబ్బతిన్నాయని, 10,19,794 టన్నుల దిగుబడులు తగ్గనున్నాయని, ఉత్పత్తి నష్టం రూ.2,779 కోట్లుగా తుది అంచనాలు రూపొందించింది. నష్టం వాటిల్లిన పంటల్లో 70-80 శాతం వరిదే.
ఫస్ట్ అంచనాల కంటే..
ఖరీఫ్ సాగు, దిగుబడులపై ప్రభుత్వ మొదటి ముందస్తు అంచనాల్లో 15.75 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని, 77.65 లక్షల టన్నుల ధాన్యం లభిస్తుందన్నారు. అంచనాల కంటే వరి సాగు స్వల్పంగా తగ్గింది. 15.66 లక్షల హెక్టార్లలోనే సాగైంది. వర్షాల కారణంగా ఉత్పత్తి నష్టం కనీసం ఏడున్నర లక్షల టన్నులు ఉండవచ్చంటున్నారు. ఆ ప్రకారం మొదటి ముందస్తు అంచనాల్లో పేర్కొన్నట్లు కాకుండా దిగుబడి 70 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉంది.
నిరుడూ అంతే
నిరుడు ఖరీఫ్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అధిక వర్షాలతో వరికి భారీ నష్టం వాటిల్లింది. మునుపటి సంవత్సరం వేసిన మొదటి ముందస్తు అంచనాల్లో 81 లక్షల టన్నులొస్తాయని అతి విశ్వాసానికి పోయారు. అంచనాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 16 లక్షల హెక్టార్లలో సాగైనప్పటికీ చివరికి వచ్చేసరికి దిగుబడి 67.60 లక్షల టన్నులకు తగ్గిపోయింది. ఉత్పాదకత బాగా తగ్గింది. వర్షాభావం, అధిక వర్షాలు రెండు విపత్తులూ ఒకే సీజన్‌లో రావడంతో ఈ తడవ కూడా వరి ఉత్పత్తి, ఉత్పాదకత నిరాశాజనకంగా ఉంది. ఖరీఫ్‌లో వరికి దెబ్బ తగిలినప్పటికీ రబీలో ఆ పంట సాగుపై ప్రభుత్వం నియంత్రణలు అమలు చేస్తోంది. కాల్వల కింద పూర్తిస్థాయిలో నీరు వదిలిపెట్టే విషయంలో సుముఖంగా లేదు. బోర్ల కింద వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించింది.











