Dec 19,2021 07:55
  • మిర్చికి వైరస్‌తో ఉపాధికి దెబ్బ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతులను తీవ్రంగా నష్టపరిచిన తామర తెగులు ప్రభావం ఈ ఏడాది వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీయనుంది. మిర్చి కోతలు లేకపోవడంతో దాదాపు నాలుగు నెలల పాటు వారి ఉపాధికి గండి పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఏటా తెలంగాణ, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది వరకు వలస కార్మికులు మిర్చి కోతల నిమిత్తం గుంటూరు జిల్లాకు వస్తుంటారు. వీరు డిసెంబరు చివరి వారం జిల్లాకు చేరుకుంటారు. జనవరి మొదటి వారం నుంచి ఏప్రిల్‌ చివరి వారం వరకు మిర్చి కోతలు కొనసాగుతుంటా యి. జిల్లాలోని మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, పెదకూరపాడు, పత్తిపాడు, తాడికొండ, చిలకలూరి పేట, సత్తెనపల్లి, గురజాల, పొన్నూరు నియోజక వర్గాల్లోని 36 మండలాల్లో మిర్చి సాగవుతోంది. మిర్చి కోతల్లో జిల్లాలోని వ్యవసాయ కార్మికులతో పాటు వలస కార్మికులు కూడా పాల్గొంటారు. వీరిలో అత్యదిక మంది పొలాల్లోనే గుడారాలు వేసుకుని కుటుంబాలతో ఉంటారు. కొంతమంది ఆయా గ్రామాల్లోని ఊరి చివరి ఖాళీ భూముల్లో గుడారాలు నిర్మించుకుంటారు. సంక్రాంతి పండగకు కూడా సొంత ఊళ్లకు వెళ్లకుండా మిర్చి కోతల్లోనే ఉంటారు. గత ఏడాది 2020 జనవరి మొదటి వారం జిల్లాకు వలస వచ్చిన 62 వేల మంది కార్మికులు అదే ఏడాది కరోనే నేపథ్యంలో జులై, ఆగస్టుల్లో తమ స్వస్థలాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు, రైళ్లతో పాటు కొంతమంది కాలినడక స్వగ్రామాలకు చేరుకున్నారు. 2021 జనవరిలో కరోనా పూర్తిగా తగ్గినా వలస జిల్లాకు వచ్చిన వలస కార్మికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ ఏడాది జిల్లాకు వలస కార్మికులు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడాది 90 వేల ఎకరాల్లో మిర్చి అదనంగా సాగు చేశారు. మొత్తం 2.65 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, 90 శాతం పంట తామర తెగులు, వైరస్‌ బారిన పడిందని జిల్లా కలెక్టర వివేక్‌ యాదవ్‌ ప్రకటించారు. పంట ఎంత వరకు బాగుందో, పూర్తిగా ఎంతవరకు తొలగించాల్సి వస్తుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో 90 శాతం పంటను తొలగిస్తే స్థానిక కార్మికులకు కూడా ఉపాధి దొరికే పరిస్థితి లేదు. వలస కార్మికులకు పనులు పూర్తిగా ప్రశ్నార్థకం కానున్నాయి.