విట్స్‌లో న్యాయ విజ్ఞానసదస్సు
ప్రజాశక్తి-కావలి : స్థానిక విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ (లోక్ అదాలత్) ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జీ ఎం.శోభ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కాలేజీలలో రాగింగ్ లాంటి కార్యక్రమాలు ఉండకూడదని స్నేహ పూర్వకంగా ఉండాలి, జూనియర్, సీనియర్ అనే వ్యత్యాసం లేకుండా ఒకరి నొకరు పోటీపడి బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయి చేరుకోవాలన్నారు. ఒక విద్యార్థి మరొక విద్యార్థిని అవహేళన చేయడం, మనసులను గాయపరచడం హింసలకు గురిచేయడం వంటి కార్యకలాపాలు చేయకూడదన్నారు. అలా చేస్తే 1997 ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని తెలియజేశారు. ఈ సదస్సులో న్యాయవాది, లీగల్ ఎయిడ్ మెంబర్ ఐ.సాయి ప్రసాద్ మాట్లాడుతూ కాలేజీలలో అవహేళనలు, ఈవ్‌టీజింగ్ వంటి వాటిని పారదోలి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ బాబు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ఐ.మధుకర్, న్యాయవాది అభిసాగర్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










