ఖాట్మండు : నేపాల్ పార్లమెంట్ దిగువసభలో ఆదివారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని షేర్ బహదూర్ దూబా నెగ్గారు. తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 165 మంది ఎంపీలు ఓటేయగా, 83 మంది వ్యతిరేకించారు. దూబాకు మద్దతుగా ఆయనకు చెందిన పార్టీ నేపాలీ కాంగ్రెస్‌తో సహా సిపిఎన్ మావోయిస్టు సెంటర్, జనతా సమాజ్‌బాది పార్టీ-నేపాల్(జెఎస్‌పి-ఎన్) ఎంపీలు నిలిచారు. ఇదే సమయంలో ప్రతిపక్ష సిపిఎన్-యుఎంఎల్‌కు చెందిన మాదవ్ కుమార్ నేపాల్‌తో పాటు ఆయన గ్రూపు అసమ్మతి ఎంపీల్లో 22 మంది విశ్వాస పరీక్షలో దూబాకు ఓటేశారు. సిపిఎన్-యుఎంఎల్‌లోనే మాజీ ప్రధాని ఓలీ గ్రూపునకు చెందిన ఎనిమిది మంది ఎంపిలు పార్టీ విప్ ధిక్కరించి దూబాకు ఓటేయడం గమనార్హం. ఈ పార్టీకి సభలో 121 ఎంపిలు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న షేర్ బహదూర్ దూబా ఈనెల 13న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ప్రధానిగా ప్రమాణం చేసిన నెలలోగా పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష నెగ్గాల్సి ఉంది.










