Dec 15,2021 18:40

పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక స్నేహితుల బృందం భారీ వర్షాల నుంచి జంతువులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. వీధుల్లో తిరిగే కుక్కలు, ఇతర జంతువుల కోసం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఇటుకలతో షెల్టర్లను నిర్మిస్తోంది. ఫలితంగా ఆ జంతువులు ఇప్పుడు కొత్త ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నాయి.
2019లో వసుంధర, ఖుషీ అమెజాన్‌ అడవి మంటల గురించి చదివారు. దీంతో స్నేహితులిద్దరూ పర్యావరణాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. తమ స్నేహితులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి ప్రతి వారాంతంలో ఏదో ఒక ప్రదేశంలో ఐదు మొక్కలు నాటాలనే లక్ష్యంతో పని ప్రారంభించారు. తమ బృందానికి 'ఉర్వరి' (పచ్చదనం) అని పేరు పెట్టుకున్నారు. ఈ బృందం పచ్చదనంతోనే ఆగిపోకుండా భారీ వర్షాల సమయంలో నిస్సహాయంగా, దీనంగా కనిపించే వీధి జంతువుల కోసం ఏదైనా చేయాలనుకుంది. ''వర్షాకాలంలో వీధుల్లో ఉండే జంతువులకు ఎక్కడా ఆశ్రయం దొరకదు. ఇళ్లలోకి వస్తే అసహ్యించుకొని తరిమేస్తారు. వర్షాలప్పుడైనా భవన ప్రాంగణంలో ఆశ్రయం కల్పించాలని కాలనీ సొసైటీలను కోరాము. వారు నిరాకరించారు'' అని చెప్తున్నారు బృందంలో ఒకరైన సియా.
జంతువులను రక్షించేందుకు పర్యావరణ ఇటుకలతో షెల్టర్లు నిర్మించాలని వారు నిర్ణయించారు. ముంబై ప్రజల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. అందులో ప్లాస్టిక్‌ సీసాలను వేరు చేసి, వాటిని మిగిలిన వ్యర్థాలతో నింపారు. వాటిని ఫాబ్రికేటర్‌కు పంపి, అక్కడివారి సహకారంతో షెల్టర్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక అధికారుల అనుమతితో షెల్టర్లను ఏర్పాటు చేశారు.
''షెల్టర్ల తయారీ ఊహించినంత సులభం కాలేదు. 150 ఇటుకల తయారీకి 40 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు కావాలి. మేము కొంతమంది స్వచ్ఛంద సేవకులతో కలిసి ప్రక్రియ ప్రారంభించాము. వ్యర్థాలు, పర్యావరణ ఇటుకలను నిల్వ చేయడానికి మాకు ప్రత్యేక స్థలం లేదు. దుర్వాసన వస్తున్నా చాలాకాలం ప్లాస్టిక్‌ వ్యర్థాలను మా ఇళ్లలోనే ఉంచాము'' అంటోంది సియా. ఈ వర్షాకాలంలో షెల్టర్లను ఏర్పాటు చేసిన స్నేహితులు ఆ తర్వాత చెత్తబుట్టలు, జంతువుల ఆశ్రయాలు, బెంచీలు, బల్లలు, గోడల కోసం పర్యావరణ ఇటుకలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ''పర్యావరణ ఇటుకల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, రీసైకిల్‌ చేయలేని ప్రాంతాల నుండి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి ఇటుకలుగా మార్చే స్వీయ-నిరంతర వ్యవస్థను సృష్టించడమే తమ లక్ష్యం అంటున్నారు ఉర్వరి సభ్యులు.