Aug 17,2022 23:38

  • విజయవాడలో సిపిఎం బృందం పర్యటన
  • కార్పొరేట్‌ కంపెనీల కోసం పేదలు బలి : బాబూరావు

ప్రజాశక్తి-విజయవాడ: అజిత్‌సింగ్‌నగర్‌, వాంబే కాలనీ, రాజీవ్‌ నగర్‌, వడ్డెర కాలనీ తదితర ప్రాంతాల్లో సిపిఎం బృందం బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా నాయకులు విద్యుత్‌ బిల్లులను పరిశీలించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. నెలకు 18 యూనిట్లు వినియోగించగా 97 రూపాయలు బిల్లు కాగా, ఫిక్స్‌డ్‌ చార్జీల పేరుతో రూ.75 , కస్టమర్‌ ఛార్జీ రూ.30, విద్యుత్‌ సుంకం రూ.18, ట్రూ అప్‌ ఛార్జీలు రూ.7 కలిపి మొత్తం 227 రూపాయలు వచ్చిందని ఓ చిరువ్యాపారి సిపిఎం నాయకుల ఎదుట వాపోయాడు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ ఏప్రిల్‌ నుండి విద్యుత్‌ చార్జీలను పెంచి రూ.1400 కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.2900 కోట్లు వరకు వసూళ్లు ప్రారంభించారన్నారు. 36 నెలల పాటు ఈ భారం కొనసాగనుందన్నారు. మరో రూ.630 కోట్ల ట్రూ అప్‌ భారం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న ఉచిత రాయితీని క్రమంగా ఎత్తివేయడానికి పూనుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించుకోవడానికి సిద్ధమైందన్నారు. ప్రతి నెలా విద్యుత్‌ రేట్లను సవరించడానికి కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్యుత్‌ పంపిణీని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం షరతులకు, విధానాలకు పూర్తిగా లొంగిపోతుందన్నారు. కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసం సాధారణ ప్రజలను బలి చేస్తున్నాయని విమర్శించారు. విద్యుత్‌ నియంత్రణ మండలి అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలిని ఎపిలో ఏర్పాటు చేయాలని, బహిరంగ విచారణ రాష్ట్రంలోనే జరిగేటట్లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, నాయకులు షేక్‌ పీరు, నిజాముద్దీన్‌, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.