Feb 14,2023 21:12

మాట్లాడుతున్న ఎస్‌ఇ వెంకటసుబ్బయ్య

మాట్లాడుతున్న ఎస్‌ఇ వెంకటసుబ్బయ్య
విద్యుత్‌ బకాయిల పేరుతో
వినియోగదారులకు టోకరా వేస్తున్నఆన్‌ లైన్‌ ముఠాలు
-విద్యుత్తు శాఖ ఎస్‌ఈ. బి. వెంకటసుబ్బయ్య హెచ్చరిక
నెల్లూరు:విద్యుత్తు బిల్లు బకాయిలు ఉన్నారంటూ వినియోగదారుల సెల్‌ఫోన్‌కు సందేశం ( ఎస్‌ఎంఎస్‌ )పంపించి నగదు దోచుకునే ఆన్‌ లైన్‌ ముఠాలు అధికమైయ్యాని, వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్‌ శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ బి.వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్‌ మోసాలకు పాల్పడేవారు ప్రప్రథమంగా వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు విద్యుత్తు శాఖకు బిల్లు బకాయి ఉందని, అందువల్ల మీ సర్వీసు కట్‌ చేస్తున్నట్లు సందేశం పంపిస్తారన్నారు. దీని మీద మీకు ఎటువంటి అనుమానం, సందేహం ఉన్నా విద్యుత్తు శాఖ అధికారికి ఫోన్‌ చేసి మాట్లాడుకోవాలంటూ ఒక నెంబర్‌ పేర్కొంటారన్నారు. నిజానికి వినియోగదారులు విద్యుత్తు బిల్లు చెల్లించి ఉన్నప్పటికీ ఇటువంటి ఎస్‌ఎంఎస్‌ రావడంతో సహజంగా ఆందోళనకు గురికావడం సహజమన్నారు
. వెంటనే ఎస్‌ఎంఎస్‌ లో ఉన్న ఫోన్‌ నెంబర్‌ కు ఫోన్‌ చేస్తాం అవతల వ్యక్తి ఎలక్ట్రిసిటీ అధికారిగా పరిచయం చేసుకుంటారన్నారు. మాటల మద్యలో మీరు భయపడాల్సిన అవసరం లేదని, మీ మొబైల్‌ నెంబర్‌కు ఒక ఆన్‌ లైన్‌ లింక్‌ పంపిస్తున్నామని ఆ లింకు ద్వారా బిల్లు చెల్లించవచ్చునని నమ్మకంగా చెబుతారన్నారు. విద్యుత్తు సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో అన్న భయంతో వినియోగదారులు ఆ లింకును క్లిక్‌ చేసి డబ్బులు చెల్లిస్తున్నారన్నారు. వినియోగదారులు చెల్లించిన నగదు సైబర్‌ నేరగాళ్లు అకౌంట్‌లో జమకావడంతోపాటు వెనువెంటనే వినియోగదారుడికి చెందిన బ్యాంకు ఖాతాలోని నగదు ఖాళీ అవుతుందన్నారు. ఈ విషయం వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు కట్‌ అయిన తరువాత సదరు బ్యాంకు నుంచి సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తేకాని తెలిసే అవకాశం ఉండదన్నారు. ఇంత జరిగిన తర్వాత బ్యాంకుకు పోయి ఫిర్యాదు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యుత్తు సంస్థ నుంచి సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో విద్యుతు సరఫరా కట్‌ చేసే అవకాశం ఉండదని, రాత్రి పూట వచ్చే ఇటువంటి సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మోదన్నారు. సంస్థ నుంచి వినియోగదారునికి రెండు సార్లు మాత్రమే మెసేజ్‌ లు వస్తాయని మొదటిది బిల్‌ రీడర్‌ మీ ఇంటిదగ్గరికి వచ్చి రీడింగ్‌ తీసి నప్పుడు , వినియోగదారుడు నగదు చెల్లించిన సమయంలో మెసేజ్‌ వస్తుంది.ఈ రెండు సార్లు మాత్రమే మా సంస్థ నుంచి మెసేజ్‌ లు వస్తాయని తెలిపారు.ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తెలిపారు.అదే విధంగా ఏదో ఒక నెంబర్‌ నుంచి మీ కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామని ఎస్‌ఎంఎస్‌ రాగానే తమ సిబ్బందిని సంప్రదించి నిజా నిజాలు తెలుసుకోవడం అవసరమన్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే ఎస్‌పిడిసిఎల్‌ అధికారులు పోలీస్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని అధికారులను కూడ అప్రమత్తం చేశామని అలాగే ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.