Apr 29,2023 23:01

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నప్పుడే విద్యార్థులు విద్యపై శ్రద్ద చూపుగలుగుతారని విద్యార్థులలో రక్త హీనతను నివారించేందుకు అందించే ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలను పిల్లలకు క్రమం తప్పకుండా అందించేందుకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు కోరారు. స్థానిక పటమటలంక కెఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్ధేశించి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. విద్యార్థినిలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి అనీమియా శాతాన్ని నమోదు చేసి రక్తహీనతను నివారించేందుకు ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఐరన్‌ మాత్రలు తీసుకునేలా ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలిం చాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన మాత్రల ఫలితంగా విద్యార్థులలో రక్తహీనత శాతం క్రమంగా పెరిగిందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారిణి సివి రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. యం సుహాసిని, ఆర్‌బిఎస్‌కె ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. జి. మాధవి, విద్యా శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కెవి ఎల్‌ ఎన్‌ కుమార్‌, డిప్యూటి డిఇవో కొండ రవికుమార్‌, ఎస్‌ పి హెచ్‌వో నరసింహానాయుడు, పిహెచ్‌సి డా. మోబిన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. పద్మ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.