ప్రజాశక్తి-చల్లపల్లి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23న జరుగుతున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. పవన్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎ.జిఅండ్ ఎస్.జి.ఎస్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద బంద్ వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం పవన్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, జగనన్న విద్యకానుక విద్యార్థులుకు రాలేదని అన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో సరైన వసతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, సన్న బియ్యం సరఫరా చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ ఉయ్యూరు కమిటీ నాయకులు బాషా, ప్రేమ్, అనిల్, జగదీష్, భార్గవ్, చందు, కుమార్, సాయి తేజ, గణేష్, కుమార్, శ్యామ్ పాల్గొన్నారు.










