Feb 14,2023 22:13

విఆర్‌ఎల నిరసన

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విఆర్‌ఎలకు పేస్‌ యాప్‌ తొలగించాలని కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఎపి విఆర్‌ఎల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక శిల్పారామంలో ఆ సంఘం నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్‌ ఉన్నందున శాంతియుతంగా నిరసన తెలిపారు. విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం పెద్దన్న మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు కల్పించి అటెండర్‌ పోస్టులలో నియమించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారికి వీఆర్‌ఏలుగా నియమించాలని, భూ సర్వేలో పాల్గొనే వీఆర్‌ఏలకు టీఏ తో పాటు డీఏ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా వీఆర్‌ఏలలో ఎక్కువ మంది విద్యా అర్హత లేనందున పేస్‌ యాప్‌ ఉపయోగించుకునే పరిజ్ఞానం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ యాప్‌ నుంచి వారిని మినహాయించాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ సేవల్లో తమ పాత్ర కీలకమని, పలుమార్లు ప్రభుత్వ దష్టికి తమ సమస్యలు తెచ్చామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. అనంతరం కోడ్‌ ఉన్నందున పరిమిత సంఖ్యలో కలెక్టరేట్‌ లోని డిఆర్‌ఒ కొండయ్యను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు ప్రసాద్‌, గంగాద్రి, నాగరాజు, చిన్న ఓబులప్ప, లింగప్ప, నాగప్ప, చిన్నయ్య, నరసప్ప, నరసింహులు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.