ప్రజాశక్తి-గోరంట్ల మండలంలోని వానవోలులో వెలసిన రంగనాథ స్వామి ఆలయాన్ని పరిశీలించాలన్న గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు శనివారం పర్యటించగా ఓ చెత్తకుప్ప పక్కన పడి ఉన్న అరుదైన రాతి స్తంభంపై వీరగల్లు శాసనం కనిపించింది. ఈ వీరగల్లు క్రీస్తుశకం 1405 సంవత్సరం నాటిదిగా చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి మైనాస్వామి గుర్తించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. వీరగల్లు నాలుగు విభాగాలుగా ఉందని, రెండో భాగంలో ఒక శాసనం, చివరి భాగంలో మరో శాసనం ఉన్నట్లు తెలిపారు. ఈ వీరగల్లు సుమారు 8 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, రెండు అడుగుల మందంతో ఉందన్నారు. మొదటి భాగంలో వీరుడు శివుని పక్కగా ఉండగా, శివుని మరోవైపు నంది వాహనం కూర్చొని ఉంది. దిగువ భాగంలో వీరుడు-వీరుని భార్య సతీసహగమనం చేయడానికి ముందు వీడ్కోలు తీసుకుంటున్నట్లు శిల్పాన్ని మలిచారని వివరించారు. వారు ఒక వేదికపై కూర్చున్నారు. వారివారికి కుడివైపునున్న ఒక స్తంభం చాలా అరుదుగా ఉంది. ఇందులో ఒక చేయి శాసనాన్ని చూపిస్తోందన్నారు. కింది భాగంలో వీరుడు నిలబడుకుని ఉండగా మరోవైపు గుర్రాన్ని నిలువరిస్తున్నాడు. శిల్పాల కింద శాసనంలో సతీసహగమనానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్నారు. స్వస్తిశ్రీ జయ అభ్యుదయ శకవర్ష 1327 పార్థివ సంవత్సరం అని శాసనం మొదలవుతుందన్నారు.. శాసనం కన్నడ భాషలో ఉందన్నారు. ఇంగ్లీషు తేదీ ప్రకారం క్రీస్తుశకం 1405లో వీరుడు వీర మరణం పొందినందుకు గుర్తుగా ఈ వీరశిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయనగర సామ్రాజ్యాన్ని రెండో హరిహరరాయలు పరిపాలిస్తున్న కాలంలో పెనుకొండలో జరిగిన ఒక యుద్ధంలో రామచంద్ర దేవా నాయకరు అనే ఒక వీరుడు వీరమరణం పొందాడని వివరించారు. రామచంద్ర దేవా భార్య గంగసాని భర్తతోపాటు సతీసహగమనం చేసినట్టు శాసనం చెబుతోందన్నారు. గంగసాని పామిడికి చెందిన వ్యాపారి బయన్న శెట్టి కుమార్తె అని, రామచంద్రదేవా నాయకునిది బహుశా వానవోలు స్వస్థలం అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే అరుదైన వీరగల్లు ఆయన స్మారకార్థం వానవోలులో వెలసినట్టు చారిత్రక పరిశోధకుడు మైనా స్వామి తెలిపారు. ఇలాంటి అరుదైన వీరజల్లులను సమీప ప్రాంతంలోని పురావస్తు ప్రదర్శనశాలకు తరలించి పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
వీరగల్లు శాసనాన్ని పరిశీలిస్తున చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి










