బాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనల చుట్టూ మీడియాలోని కొన్ని వార్తా సంస్థలు స్వీయ భాష్యాలతో సంచలనాత్మక కథనాలు వండి వారుస్తున్నాయి. దేశంలో కవర్ చేయడానికి సమస్యలేమీ లేవన్నట్టు ఈ రెండు ఘటనల్లోనే మునిగితేలుతున్నాయి. వీటిలో ఒకటి యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కాగా ఇంకొకటి ముంబయి మహా నగరాన్ని 'పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)'తో పోలుస్తూ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల ఉదంతం.
సుశాంత్ గత జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అతడి బలవన్మరణంపై వస్తున్న కథనాలు మరింత దిగ్భ్రాంతికి, గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. మహిళల పట్ల విద్వేషం, ఇతరుల వ్యక్తిగత అంశాలను తెలుసుకోవాలనే ఉబలాటం, ఒక వ్యక్తి గోప్యతాంశాలను బహిర్గతం చేయడం, స్పష్టత లేని అవాస్తవాల కుమ్మరింతతో నిండిన ఎల్లో మీడియా రాతలను చూస్తుంటే సమాజం ఇంతటి తిరోగమనంలో పయణిస్తోందా అనే సందేహం కలగకమానదు. సుశాంత్ మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన అతని తండ్రి తమ బిడ్డ మరణానికి సహచర నటి రియా చక్రవర్తి కుట్రే కారణమని ఆరోపించారు. ఆమెపై పదేళ్ల పాటు శిక్ష విధించదగ్గ నేరాభియోగంపై కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి ఎల్లో మీడియా రెచ్చిపోయింది. రియాను తమ ఎక్స్‌క్లూజివ్ కథనాలతో రాచి రంపాన పెట్టడం మొదలెట్టాయి. డబ్బు కోసం ఆమె ఎవరితోనైనా సంబంధాలు నెరుపుతుందని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ న్యూస్‌రూమ్‌ల్లోనే తీర్పులు వెలువరించేస్తున్నాయి.
ఈ తీర్పులను కూర్చే పనిలో బిజీ అయిపోయిన బడా మీడియా సంస్థలకు 40 లక్షల పైబడిన కోవిడ్ కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో అగ్రస్థానం దిశగా భారత్ పరుగుపెడుతున్న వైనాన్ని పట్టించుకునే తీరిక దొరకడం లేదు. మైనస్ 23.9 శాతానికి పడిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)పై పతనంపై విశ్లేషణ ఇద్దామన్నా సమయం మిగలట్లేదు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు చెడిన నేపథ్యంలో సరిహద్దులో స్నేహగీతిక దారులను అవలోకిద్దామా? అంటే ఏమాత్రమూ వీలు చిక్కడం లేదు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో కోట్లాది మంది ప్రజానీకం తినే తిండి కూడా కరువై అఘోరిస్తున్నా ఆ కథనాలకు చోటు లేదు.
సుశాంత్ ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన నటుడు. ముంబయిలో నివసించేవాడు. మహారాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమితో జట్టుకట్టి శివసేన అధికారంలో కొనసాగుతోంది. శివసేన గతంలో బిజెపి మిత్రపక్షం. సుశాంత్ మరణాన్ని తమకు అనుకూలంగా మల్చుకొని మైలేజీ కొట్టేయాలని రాజకీయ పక్షాలు పాచికలు విసురుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలనూ బరిలోకి దింపుతున్నాయి. ఇలాంటి ఎత్తుగడల్లో నాలుగాకులు ఎక్కువే చదివిన బిజెపి ఇంకాస్త జోరుమీద పాచికలు విసురుతోంది. యువ నటి కంగన రనౌత్ ముంబయిపై చేసిన వ్యాఖ్యలు ఈ క్రమంలోనివేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ముంబయిలో భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేయడం వేరు..ముంబయి మహానగరాన్ని కించపర్చేలా విద్వేషం వెళ్లగక్కడం వేరు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కంగన తరహా 'విద్వేష వ్యాఖ్యలు' చేసినవారిని అక్కడి ప్రభుత్వాలు ఎంతలా వేధించాయో తెలియనిది కాదు. ఇప్పుడు కంగనకు మాత్రం 'వై' కేటగిరి భద్రత కల్పించారు. తెర వెనకుండి కపట నాటకమాడిస్తున్న బిజెపి తీరు చూస్తుంటే అసహ్యం వేయకమానదు. వాస్తవానికి సుశాంత్ మరణం కేసులో కేంద్ర ప్రభుత్వంలోని మూడు అత్యున్నత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇడి, సిబిఐ, ఎన్‌సిబి దర్యాప్తు సాగిస్తున్నాయి. రియాను గుచ్చిగుచ్చి విచారణలు సాగించాయి. ఈ నెల 8న ఆమెను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది కూడా. మిత్రుడిని కోల్పోయిన విషాదంలో ఉన్న తాను ఏ తప్పు చేయలేదని రియా స్పష్టం చేసింది. అయితే ఆమెను అమ్మాయి అని కూడా చూడకుండా నడిరోడ్డు మీద గుచ్చిగుచ్చి సిగ్గుమాలిన ప్రశ్నలు అడుగుతున్న ఎల్లో మీడియా తీరుతో ఆమె కుటుంబం ఎంతటి వేదనకు గురౌతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రియా తప్పు చేసివుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఆమెను, ఆమె కుటుంబాన్ని స్వీయ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి బలి చేస్తూ స్వీయ తీర్పులు ఇచ్చేయడం సబబు కాదు. ఇప్పటికైనా ప్రధాన స్రవంతి మీడియా తన సంచలనాత్మక ధోరణి వీడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ఆశిద్దాం.










