ముంబయి : షాహీన్‌బాగ్ మహిళ బిల్కిన్ బానోపై అవమానకరమైన ట్వీట్ చేసినందుకు గాను బాలీవుడ్ నటి కంగనారనౌత్‌కు ఢిల్లీ సిక్కు సంఘం నోటీసులిచ్చింది. ఆమె వారం రోజుల లోపు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (డిఎస్‌జిఎంసి) చీఫ్ మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన షాహీన్‌బాగ్ మహిళ.. ఎక్కడ నిరసనలైనా రూ. 100లకు అందుబాటులో ఉంటారంటూ కంగనా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై నిరసనలు వెల్లువెత్తడంతో.. అనంతరం తన ఖాతా నుండి తొలగించారు. ఒక రైతు తల్లిని రూ. 100కు అందుబాటులో ఉండే మహిళగా పేర్కొన్న ఆమె అవమానకరమైన ట్వీట్‌పై నోటీసులు పంపామని సిర్సా అన్నారు. ఆమె ట్వీట్ రైతు ఉద్యమాన్ని దేశ వ్యతిరేక ఉద్యమంగా చిత్రీకరిస్తున్నాయని, ఈ అనాలోచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సిర్సా ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల పంజాబ్ న్యాయవాది హర్కమ్ సింగ్ కూడా కంగనాకు నోటీసులు పంపారు. ఆ మహిళ నకిలీ మహిళ కాదని, ఆమె పేరు మహీందర్ కౌర్. బతిండాకు చెందిన మహిళ అని, రైతు లాబ్‌సింగ్ నంబార్దర్ భార్య అని మీకు తెలియచేస్తున్నానని నోటీసులో పేర్కొన్నారు.










