Mar 26,2023 15:17

చండీగఢ్‌   :   పరారీలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటు వాద నేత అమృతపాల్ ను   సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్  హెచ్చరించింది.   పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని అమృత్‌పాల్‌ను హెచ్చరించింది. ఈ మేరకు అకాల్‌ తఖ్త్‌ జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.  అలాగే ఆయన పోలీసుల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు కురిపించారు. అంతపెద్ద దళం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమృత్‌పాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అమృత్‌పాల్‌ బయటపడితే.. పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడినని హర్‌ప్రీత్‌ అన్నారు.  పంజాబ్‌లో అంతమంది పోలీసులున్నా.. అమృత్‌పాల్‌ను  ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని  ప్రపంచ వ్యాప్తంగా సిక్కుల మదిలో ఓ ప్రశ్న మెదులుతోందని  అన్నారు. ఈ ఘటన పోలీసుల పనితీరుపై కూడా సందేహాలను రేకెత్తిస్తోందన్నారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు హర్‌ప్రీత్‌ తెలిపారు. ఒక వేళ అతనిని ఇప్పటికే అరెస్టు చేస్తే పోలీసులు ఆ వివరాలను ప్రకటించాలన్నారు.   అలాగే అమృత్‌పాల్‌ కేసులో అరెస్టయిన సిక్కు యువకులు పోలీసులు అంచనా వేసినట్లుగా పెద్ద నేరాలు చేయలేదని సూచించారు.   అయితే ఇప్పటికే తమ కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అమృతపాల్‌ తల్లిదండ్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.