- దిబ్రూగఢ్ జైలుకు తరలింపు
- అరెస్టు చేశారా? లొంగిపోయాడా?
చంఢగీఢ్ : పోలీసులకు చిక్కకుండా నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే (డబ్ల్యూపిడి) చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఖలిస్తాన్ ఉగ్రవాది బింద్రన్‌వాలే స్వగ్రామమైన మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఆదివారం ఉదయం 6:45 గంటలకు అతడ్ని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.. ఆ వెంటనే అస్సాంలో దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు ప్రత్యేక విమానంలో అతడ్ని తరలించారు.. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజిపి) సుక్‌చైన్ సింగ్ గిల్ చంఢగీఢ్‌లో మీడియాకు వెల్లడించారు. అయితే అమృతపాల్ అరెస్టు కాలేదని, ఆతడే స్వయంగా లంగిపోయాడనే వాదనలు కూడా వినిపించాయి. పోలీసులు అమృతపాల్‌ను అరెస్టు చేశామని చెబుతుండగా, అమృతపాల్ అనుచరులు మాత్రం అతడే లంగిపోయాడని అంటున్నారు. రోడే గ్రామంలో గురుద్వారా వద్ద అమృతపాల్ తన అనుచరులనుద్దేశించి మాట్లాడుతూ, తాను లొంగిపోతున్నానని ఆయన స్పష్టంగా చెప్పినట్లు ఓ వీడియోలో ఉంది. అది ఇప్పుడు ఒసోష్లల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి ఆయనది అరెస్టు కాదు, సరెండర్ అని అమృతపాల్ అనుయాయుల వాదన. పోలీసుల కథనం వేరేలా ఉంది. అమృత్‌పాల్‌ను పట్టుకోవడానికి పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ఫలించిందని పోలీస్ ఉన్నతాధికారి గిల్ తెలిపారు. రోడే గ్రామంలో అమృత్‌పాల్ ఉన్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారన, ఆ గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృతపాల్ దాక్కున్నాడని తెలియడంతో గురుద్వారా పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు గురుద్వారాలోకి వెళ్లకుండానే, అన్ని మార్గాలు మూసివేసి అతడిని బయటకు రప్పించేలా చేశారని గిల్ తెలిపారు. . అమృతపాల్‌ను తీసుకుని భటిండా నుంచి బయల్దేరిన ప్రత్యే విమానం ఆదివారం మధ్యాహ్నం 2:20 గంటలకు దిబ్రూగఢ్ విమానాశ్రయంలో దిగింది. అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసి అతడిని సెంటల్ జైలుకు తరలించారు. సెంట్రల్ జైలు వద్ద పలు అంచెల భద్రతా వలయాలను ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అరెస్టయిన అమృత్‌పాల్ సింగ్ అనుచరులు తొమ్మిది మంది దల్జిత్ సింగ్ కల్సి, పాపల్‌ప్రీత్ సింగ్, కుల్వంత్ సింగ్ ధాలివాల్, వరిందర్ సింగ్ జోహల్, గుర్మీత్ సింగ్ బుక్కన్‌వాలా, హర్జిత్ సింగ్, భగవంత్ సింగ్, బసంత్ సింగ్, గురిందర్‌పాల్ సింగ్ ఔజ్లా ఇదే జైలులో ఉన్నారు.










