Feb 16,2023 21:58

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        పుట్టపర్తి అర్బన్‌: జిల్లాల్లో రీసర్వే, గృహ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా||జవహార్‌రెడ్డికి తెలియజేశారు. గురువారం సాయంత్రం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్‌, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, ఈ క్రాప్‌ బుకింగ్‌ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుంచి వర్చువల్‌ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, సంబంధిత జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పంపిణీపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వివరణ కోరగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర హైవే నిర్మాణంలో భాగంగా జిల్లాలో 650 హెక్టర్ల భూమిని సేకరించామని చెప్పారు. ఫిబ్రవరి మాసానికి 300 హెక్టార్ల భూమికి సంబంధించిన రైతులకు న్యాయమైన పరిహారాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న భుహక్కు భూ రక్ష రీసర్వే లో గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌, డిఎల్‌ఆర్‌ పబ్లిష్‌ చేయడం, హక్కు పత్రాలు అందజేయడం వంటివి ఫిబ్రవరి మాసాంతానికి సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. జాతీయ రహదారులు, ఎపిఐఐసి కోసం భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎకు వెళ్లకుండా అర్థవంతమైన పరిష్కారం అర్జీదారులకు చూపాలన్నారు. రెవెన్యూ అంశాలు మరింత జాగ్రత్తగా పరిశీలన, త్వరితగతిన అర్జీదారుని సంతప్తి మేరకు పరిష్కరించాలని తెలిపారు. వ్యవసాయశాఖకు సంబంధించి రబీ వరి పంటకు ఈ క్రాపింగ్‌ పూర్తి చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ సన్నద్ధం కావాలని అన్నారు. పిఎం కిసాన్‌ ఈకెవైసి సకాలంలో పూర్తి చేయాలని, ఏదైనా తగ్గుదల ఉంటే సరైన కారణాలు నివేదికలు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సుబ్బారావు, చంద్రశేఖర్‌, పద్మావతి, హౌసింగ్‌ అధికారి చంద్రమౌళి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి రషీద్‌, డిడబ్ల్యూఎంఎ అధికారి రామాంజనేయులు, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ గోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.