కరోనా సంక్షోభంలో వైద్య వృత్తి ప్రచార మాధ్యమాల్లో కేంద్రకంగా ఉంది. ఒక వైపు సైన్యం, వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై హెలికాప్టర్ నుంచి పూలుజల్లి అపూర్వంగా గౌరవిస్తే, మరో వైపు మీడియాలో అంతకుమించి రాళ్లు కురుస్తున్నాయి. ఈ వాతావరణం వైద్యులపై అనవసర వత్తిడి పెంచుతాయి. కనుక వాస్తవికతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైద్యుణ్ణి దేవుడుగా చెయ్యడం వల్ల రోగి ప్రాణం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపేవాడుగా భావించి, ఏమాత్రం పరిస్థితి తారుమారైనా తట్టుకోలేని స్థితికి చేరతారు రోగి బంధువులు. వ్యాధి ముదిరి చెయ్యి దాటిపోతే వైద్యుడే కారణమంటారు. అలా కాకుండా వైద్యుడిని ధన పిశాచిగా చిత్రిస్తే మొదటే నమ్మకం లేకుండా తయారౌతారు. కాబట్టి గంపగుత్తగా సాధారణీకరణ చెయ్యడం మాని ఏ కేసుకు ఆ కేసు చూడాలి. లేదా అలవోకగా చేసే వ్యాఖ్యానాలు సమాజానికి హాని చేస్తాయి. వైద్యులిప్పుడు తీవ్ర వత్తిడిలో పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి చికిత్సలో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే దాని బారిన పడి దేశంలో రెండు వందల మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. శారీరక, మానసిక వత్తిళ్లు అధిగమిస్తూ, తమ కుటుంబాలకు తమ ద్వారా పెరిగిన రిస్కు భరిస్తూ, వృత్తి ధర్మం నెరవేరుస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ వైద్యం ప్రజల మూలుగులు పీల్చేస్తున్న వైనం వార్తల్లో ఉంది. అయితే ఇందులో కూడా వైద్యుడి పాత్ర తక్కువే. కార్పొరేట్ పీల్చిన బిల్లులో అందులో పని చేసే వైద్యుడికి అందేది జీతమే. ముఖ్యంగా లోపం వ్యవస్థలో ఉంది. ప్రభుత్వం ద్వారా అందే సేవలు ప్రజానీకానికి చాలవు. 1000 మంది జనాభాకు ఒక వైద్యుడు కనీసం ఉండాల్సిన చోట 1450 మందికి ఒకరున్నారు మన దేశంలో. హాస్పిటళ్లు, మందులు కొరత. ప్రభుత్వపు కేటాయింపులు తక్కువ. ప్రయివేటు వైద్యంపై ఆధారపడి తీరాల్సిన అవసరం. వైద్యం ఖర్చులో రూపాయికి 65 పైసలు పౌరుడే భరించాల్సిన దుస్థితి. మరోవైపు కార్పొరేట్ హాస్పిటళ్లు అన్ని ఆధునిక పరికరాలు, సౌకర్యాలు చూపిస్తున్నప్పుడు రోగి సహజంగానే అటు వెళ్లాలనుకొంటాడు. అందులో సేవా ధర్మం చూపించేవారు రీజనబుల్‌గా బిల్లు వేస్తే, వ్యాపార దృక్పథం ఉన్నవారు ఇంకొంచెం లాభం చూస్తే, అనైతిక వ్యాపార దృష్టి ఉన్న వాళ్ళు శక్తి కొద్దీ పిండేస్తారు. అన్ని రకాల వాళ్ళూ ఉన్నారు అన్ని రంగాల్లో లాగే. అలా పిండకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దగ్గరగా పరిశీలించి, నియంత్రణ చెయ్యాలి. వైద్యులపై, సంస్థలపై దాడులు జరగకుండా చూడాలి. వారు తప్పు చేసినపుడు చర్య తీసుకోవాలి. దీర్ఘకాలికంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకొంటూనే, ప్రస్తుతం నెలకొన్న అపోహలు, అవకతవకలు సరిదిద్దాలి. రోగికి నమ్మకం, వైద్యుడు, ఇతర సిబ్బందికి నైతిక స్థైర్యం ఉండేలా వాతావరణం ఏర్పడడానికి ప్రభుత్వం, మీడియా, పౌర సమాజం కృషి చేయాలి. అసలు సమస్యను వదిలి బలిపశువుల కోసం చూస్తే బలయ్యేది ప్రజారోగ్యమే.
* డా|| డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, సెల్ : 9440836931










