Sep 28,2023 09:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిపిఎస్‌ బిల్లును ఆమోదించి వారి ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసిందని యుటిఎఫ్‌ విమర్శించింది. ఉద్యోగులందరికీ చీకటి రోజు అని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిపిఎస్‌ వద్దని, పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా జిపిఎస్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిపిఎస్‌కు గ్యారెంటీ పెన్షన్‌ అని పేరు పెట్టడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయటమేనని ఆక్షేపించారు. ఏ రాష్ట్రంలో లేని కొత్త విధానం, దేశానికి ఆదర్శం అని ప్రభుత్వం చెబుతుందని పేర్కొన్నారు. కంట్రిబ్యూషన్‌ కట్టించుకునే విధానం ఆదర్శమెలా అవుతుందని ప్రశ్నించారు. భవిష్యత్‌లో జిపిఎస్‌ చట్టం రద్దు, పాత పెన్షన్‌ సాధించడం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని, అందుకు తగిన ఉద్యమ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. జిపిఎస్‌ బిల్లు ఆమోదం సిపిఎస్‌ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం అని డిటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నరహరి, ఎన్‌వి రమణయ్య మరో ప్రకటనలో పేర్కొన్నారు.