ఉపాధ్యాయవర్గ సామాజిక, ఆర్థికవృద్ధికి యుటిఎఫ్ కృషి
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంఘాన్ని తీర్చిదిద్దాలి
యుటిఎఫ్ స్వర్ణోత్సవ సభలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి:'ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఉపాధ్యాయవర్గం ఈ స్ధాయికి రావడానికి యుటిఎఫ్ జెండా కింద జరిగిన అనేక పోరాటాలు కారణం. ఇందంతా చూసి సంతోషించాలి. గర్వపడాలి. వాటిని గుర్తు చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా యుటిఎఫ్‌ను తీర్చిదిద్దాలి' అని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సర్ణోత్సవ ప్రారంభ వేడుకలు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ సెంటర్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆయాచితంగా ఉపాధ్యాయులకు హక్కులు కల్పించలేదని, యుటిఎఫ్ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా హక్కులు కల్పించబడ్డాయనే విషయాన్ని నేటి తరం ఉపాధ్యాయులు తెలుసుకోవాలని అన్నారు. రామిరెడ్డి, వెంకటస్వామి, మైనేని లాంటి గొప్ప నాయకత్వ బాటలో రాష్ట్ర స్ధాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు ఉపాధ్యాయ ఉద్యమం కోసం ఎందరో జీవితాలను త్యాగం చేశారని, సైద్ధాంతిక పునాది వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తీసుకున్న సూత్రబద్ధమైన వైఖరి తర్వాత ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ యుటిఎఫ్ మరింత బలపడడానికి దోహదపడిందన్నారు. యుటిఎఫ్ ప్రత్యేకత కేవలం ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడడమే కాదని, ఒక సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం కలిగి ఉండడమని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంఘాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి మాట్లాడుతూ మాతృభాషలో ప్రాథమిక విద్య అభ్యసించినప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదని పేర్కొన్నారు. స్థిరమైన విద్యావిధానం అమలు చేయాలన్నారు. శాసనమండలిలో పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సంఘం నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాల కారణంగా 50 సంవత్సరాల్లో ప్రముఖ ఉపాధ్యాయ సంఘంగా యుటిఎఫ్ ఎదిగిందని తెలిపారు. అప్రంటీస్ విధానం రద్దు కోసం యుటిఎఫ్ సహకారంతో ఎనిమిది రోజులపాటు తాను నిరాహారదీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంఘం మరింత సామాజిక స్పృహతో పనిచేయాలని, సంఘ నాయకులు, కార్యకర్తలు బాధ్యతలను చక్కగా నెరవేర్చుతూ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు పోరాడుతుంటే ప్రభుత్వం మొండిగా సిపిఎస్ కన్నా ప్రమాదకరమైన జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఒపిఎస్ సాధించడమే సంఘ కర్తవ్యంగా ఉండాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షోపన్యాసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని ప్రయివేటీకరించేందుకు పూనుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాలలను విలీనం చేసి, టీచర్ పోస్టులు కుదిస్తోందని తెలిపారు. పాఠశాల విద్య బలోపేతం కావాలంటే అందరూ మరింత కష్టపడి పనిచేయాలని, ఉపాధ్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ జిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, రాబోయే రోజుల్లో ఒపిఎస్ సాధనకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, డిఎస్‌సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘ పూర్వ అధ్యక్షులు కె.జోజయ్య తొలుత సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో యుటిఎఫ్ స్వర్ణోత్సవాల లోగోను సంఘ రాష్ట్ర పూర్వ కార్యదర్శి చిట్టిబాబు, సంఘం విడుదల చేసిన గోల్డ్ కాయిన్‌ను కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ, సంఘం 26 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల కమిటీల బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










