Jun 22,2022 22:21

ప్రజాశక్తి - తగరపువలస,శ్రీకాకుళం అర్బన్‌ :చిట్టివలస జ్యూట్‌ మిల్లు కార్మికులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. 'ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించుకుందాం' అనే నినాదంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న విశాఖలోని ఉక్కునగరంలో ప్రారంభమైన జీపు జాతా రెండో రోజైన బుధవారం తగరపువలస, శ్రీకాకుళంలో పర్యటించింది. తొలుత వేదిక ప్రతినిధులు చిట్టివలస జ్యూట్‌మిల్లును సందర్శించారు. మిల్లు గేటు వద్ద స్థానికులనుద్దేశించి అజశర్మ మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న చిట్టివలస జ్యూట్‌ మిల్లు పాలకుల నిర్లక్ష్యంతో శాశ్వతంగా మూత పడిందని ఆవేదన వ్యక్తం జేశారు. దీంతో వందలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అణుపార్కు ప్రతిపాదిత కొవ్వాడ, ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటి, శ్రీకాకుళం రిమ్స్‌ను పరిశీలించి, సభ నిర్వహించారు. ప్రపంచమంతా తిరస్కరించిన అణు విద్యుత్కేంద్రాన్ని కొవ్వాడలో ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర నెత్తిన కేంద్ర ప్రభుత్వం అణు కుంపటి పెడుతోందని విమర్శించారు. స్వాతంత్య్రానికి ముందు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రాంతం ఉత్తరాంధ్ర అని, పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.