Sep 13,2023 20:35
  •  విశాఖపట్నం సిఎండి పృథ్వీరాజ్‌

ప్రజాశక్తి - పలాస (శ్రీకాకుళం) : ఉద్దానం ప్రాంతంలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపడతామని విశాఖపట్నం విద్యుత్‌ శాఖ సిఎండి ఐ.పృథ్వీరాజ్‌ తెలిపారు. పలాస విద్యుత్‌శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందనే ఫిర్యాదులు వచ్చాయని, సమస్యను తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు. ఉద్దానంలో చెట్ల కొమ్మల మధ్య నుంచి విద్యుత్తు లైన్ల సరఫరా అవుతుండడంతో ఈ ఇబ్బంది వస్తోందని, కవర్‌ కండక్టర్‌ ద్వారా ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో చర్యలు చేపడుతున్నామన్నారు. కొత్త సబ్‌ స్టేషన్లతో పాటుగా ఇంటర్‌ కనెక్టింగ్‌ లైన్లు వేసేందుకు 11కె.వి. లైను 302 కిలోమీటర్లు, కవిటి మండలంలో 33 కెవిలైను 28 కిలోమీటర్ల మేర వేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కాశీబుగ్గ పద్మనాభపురం సచివాలయాన్ని సందర్శించారు. విద్యుత్‌ మీటర్లకు ఆధార్‌ అనుసంధానం చేయాలని, అందుకు సచివాలయం ఉద్యోగులు సహకరించాలని కోరారు. జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ ఎల్‌.దైవప్రసాద్‌, ఇ.ఇ.జి ప్రసాద్‌, ఎస్‌ఎఒపి తాతాచార్యులు, డిఇఇఐ కృష్ణమూర్తి, ఎఇలు వివేకానంద, నాగభూషణ్‌, యోగి, గార రాజారావు, విద్యుత్తు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.