Nov 28,2020 22:11

ప్రభుత్వ ఉద్యోగులు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు చెల్లింపునకు ఆర్థిక శాఖ మోకాలడ్డుతూ షరతులు విధించింది. దీనికి తోడు ప్రతి నెలా 25 నుంచి శాఖల వారీగా జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేసే వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల జీతాలు చెల్లింపు మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే జీతాలు మినహా మిగిలిన బిల్లుల చెల్లింపులో గత కొన్ని నెలలుగా ఆంక్షలున్నాయి. తాజాగా జీతాలకు ఆంక్షలు విధిస్తూ ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో 139 ప్రభుత్వ శాఖలతో పాటు అనుబంధ శాఖల్లో వేలసంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతి నెలా 1వతేదీన ప్రభుత్వం జీతాలు చెల్లిస్తూ నేరుగా వారి బ్యాంకుఖాతాలకు జమ చేస్తున్నారు. అయితే నెలలో 25వ తేదీ నుంచి ఉద్యోగుల పనిదినాలతో కూడిన వివరాలను పొందుపరుస్తూ శాఖల వారీగా సీనియర్‌ సహాయకులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్‌ చేసిన వివరాల ఆధారంగా ట్రజరీ అధికారులు పరిశీలన అనంతరం వేతనాలు చెల్లిస్తుంటారు. సెలవులో ఉన్నవారు, అనారోగ్య సమస్యల కారణంగా మెడికల్‌ లీవు పొందిన వారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, ఇతర సాంకేతిక అంశాలను ట్రెజరీ అధికారులు ధ్రువీకరించిన తర్వాత బిల్లు సిఎఫ్‌ఎంఎస్‌ ఆమోదానికి వెళ్తుంది. ఆర్థిక శాఖ అనుమతితో 1వ తేదీన జీతాలు బ్యాంకుఖాతాలకు నేరుగా జమ చేస్తారు. ప్రతి నెలా జరిగే ఈ విధానాన్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వ శాఖల వారీగా హెచ్‌ఆర్‌డి వివరాలు సత్వరం పంపిస్తే తప్ప జీతాల బిల్లులను అనుమతించబోమని ఈ నెల 26న ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు 25 నుంచి బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు వెబ్‌సైట్‌లో అనుమతిస్తారు. కానీ ఈ సారి గత మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు నిరాకరించడంతో జీతాలు చెల్లింపులో జాప్యం తప్పదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్‌ఆర్‌డి వివరాలంటే?
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను శాఖలవారీగా ప్రభుత్వం సేకరించేందుకు నిర్ణయించింది. ఇందులో హ్యూమన్‌ రీసోర్సు డేటా(హెచ్‌ఆర్‌డి) అంటే ప్రభుత్వ శాఖకు మంజూరైన పోస్టు సంఖ్య, ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య, వారి హోదా, వారి నియామకం ఏ పద్దతిలో జరిగిందనే అంశాలు అందులో పొందుపరచాల్సి ఉంటుంది. 1993 నవంబరు 25 తర్వాత ప్రభుత్వ శాఖల్లో దొడ్డిదారి నియామకాలు చెల్లవంటూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగ నియామకాలు ఏ పద్ధతిలో చేపట్టి నియామకపు ఉత్తర్వులు ఇచ్చారో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఇప్పటికిప్పుడు శాఖల వారీగా సిద్దం చేసి, నివేదించడానికి ప్రభుత్వ శాఖల్లో సామర్థ్యం లేదు. కొన్ని శాఖల్లో ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తే తప్ప పూర్తి స్థాయి నివేదికలు సమర్పించడం సాధ్యం కావడంలేదు. ఈ నివేదికలు సమర్పిస్తే తప్ప జీతాలు చెల్లించబోమని ఆర్థికశాఖ ప్రకటించడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది.
జీతాలు చెల్లింపు ఆలస్యానికే హెచ్‌ఆర్‌డి సాకు
ప్రభుత్వం సిఆర్‌డి వివరాలు సాకుగా చూపి జీతాలు చెల్లించడంలో కొంత జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగమే ఆర్థికశాఖ ఉత్తర్వులు. ప్రతి నెలా జీతాల బిల్లులు 25న అప్‌లోడ్‌ చేస్తారు. కాని ఆర్థికశాఖ 26న హెచ్‌ఆర్‌డి వివరాలంటూ వెబ్‌సైట్‌ను నిలుపుదల చేసింది. ఇది కేవలం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిని కప్పిపుచ్చుకునేందుకు తీసుకున్న నిర్ణయంగానే యుటిఎఫ్‌ భావిస్తోంది.
-రెడ్డి మోహనరావు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
జీతాలు చెల్లింపులో జాప్యం తగదు

నెల రోజుల పాటు కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు 1వతేదీన జీతాలు రాకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. కొందరు ఉద్యోగులకు జీతాలతోనే ఇంటి అద్దె, కుటుంబ అవసరాలు, బ్యాంకు రుణాలు చెల్లింపు వంటివి ముడిపడి ఉన్నాయి. బ్యాంకుల్లో సకాలంలో చెల్లింపులు జరగకపోతే వడ్డీల భారం పెరుగుతుంది. హెచ్‌ఆర్‌డి వివరాలకు ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టి సకాలంలో జీతాలు చెల్లించకుండా నిలుపుదల చేయడం ఆందోళనకరం. బిల్లులు పెట్టుకునేందుకు తక్షణమే ఆర్థిక శాఖ అనుమతించాలి.
- హెచ్‌.సాయిరాం, ఎపి ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు