న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం ఉద్యోగుల దరఖాస్తుల ముగింపు గడువును సోమవారం పొడిగించింది. అర్హులైన సభ్యులందరూ తమ యజమానులతో కలిసి మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 2014, సెప్టెంబర్ 1కి ముందు సర్వీస్‌లో ఉండి, అనంతరం సర్వీసులో కొనసాగిన ఉద్యోగుల కోసం ఉమ్మడి ఎంపిక కోసం ముగింపు గడువును 2023 మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ఇపిఎఫ్‌ఒ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అర్హత గల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకునేందుకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం .. నాలుగు నెలల గడువు మార్చి 3తో ముగియనుంది. ఈ పథకం కింద ఉద్యోగులు, యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గతవారం ఇపిఎస్ ఒక పోర్టల్‌ను విడుదల చేసింది.










