ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించలేదని తక్షణమే కూలీలకు పనులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ కోరారు. ఈ మేరకు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్‌కు కోటకళ్యాణ్ వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా కోట కళ్యాణ్ మాట్లాడుతూ.. గడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌టిఆర్ జిల్లాలోని ఆయా మండలాల్లో ఆరు వారాల నుంచి ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని, కానీ పైడూరుపాడులో ఎటువంటి పనులు జరగడం లేదని అన్నారు. పనులు లేక , కుటుంబాలు గడవక ఆ గ్రామంలోని కూలీలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. వర్షాలు పడితే పనులు ఆగిపోయే పరిస్థితి ఉందని అన్నారు. గతంలో ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ఎఫ్.ఎని సస్పెండ్ చేశామని అందుకే పనులు జరగడం లేదని సంబంధిత అధికారులు చెపుతున్నా... ఎఫ్‌ఏను, సీనియర్ మేట్నిని ఇప్పటికీ నియమించకుండా పనుల్లో జాప్యం జరుగుతుందని వెంటనే అధికారులు స్పందించి అవినీతి చేసిన వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక డబ్బులు రికవరీ చేసి, పేదలకు ఇవ్వాలని కోరారు. తక్షణం ఎఫ్.ఏని నియమించి పనులు జరిగేటట్లు సంబంధిత అధికారులను ఆదేశించాలని జెసిని కోరారు. లేనట్లయితే కూలీలను కలుపుకొని ఆందోళన చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. నాయకులు రాంబాబు, వాణి ,పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.










