Feb 10,2023 22:19

మురళీమోహన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - పరిగి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు పట్టుదలతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఫైర్‌ సర్వీస్‌ డైరక్టర్‌ మురళీమోహన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల ప్రతిభా పాఠశాల కొడిగెనహళ్లి పూర్వ విద్యార్థి (1986) అయిన ఆంధ్రప్రదేశ్‌ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ మురళిమోహన్‌ శుక్రవారం స్థానిక గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ ఎపిఆర్‌ఎస్‌ పాఠశాలలో ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారన్నారు. ఇక్కడ విద్య నేర్చుకోవడమే వల్లే తన లాంటి వ్యక్తుల జీవితంలో ఉన్నత స్థానంలో ఉండగలిగారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ పాఠశాలలో తాను చదివిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. పాఠశాలలోని పరిసరాలను, డిజిటల్‌ లైబ్రరీ, డైనింగ్‌ హాల్‌ను, లైబ్రరీ, తరగతి గదులను, డార్మిటరీస్‌ ను సందర్శించారు. పాఠశాలను అభివృద్ధి బాటలో నిలిపిన పూర్వ విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. చక్కగా చదివి 10వ తరగతి పరీక్షలను బాగా రాయాలన్నారు. ఈసందర్భంగా మురళీ మోహన్‌ తో పాటు సత్య సాయి జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శంకరప్రసాద్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌తో పాటు హిందూపూర్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు డాక్టర్‌ దినకర్‌, గవర్నమెంట్‌ హాస్పిటల డాక్టర్‌ అశ్వర్థ నారాయణ పాల్గొని పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు.