లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మంగళవారం కీలక క్యాబినెట్ నియామకాలను చేపట్టారు. సౌయెల్లా బ్రేవర్మన్‌ను హోం శాఖ కార్యదర్శిగా తిరిగి తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. బ్రేవర్మన్ రాజీనామా లేఖతో లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల వలసవిధానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రేవర్మన్ అనుసరించనున్న నూతన విధానం ఎలా ఉండబోతోందో చూడాల్సి వుంది. వీసా కాలం ముగిసినప్పటికీ భారతీయులు బ్రిటన్‌లో ఉంటున్నారని.. ఇది భారత్-బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)కి నష్టం కలిగించనుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కెమీ బాడెనోచ్ ట్రేడ్ సెక్రటరీగా కొనసాగడంతో ఎఫ్‌టిఎపై చర్చలకు ఊతమివ్వవచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేందుకు కొత్త చాన్సలర్‌గా జెరెమీ హంట్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పన్నుల తగ్గింపు బడ్జెట్‌ను తిప్పికొట్టడంతో హంట్‌ను ఈ నెల ప్రారంభంలో వేటుకు గురైన జెరెమీ హంట్, రిషి మిత్రుడిని తిరిగి కొనసాగిస్తారని అంచనా వేశారు. ఈ అంచనాను నిర్థారిస్తూ రిషి జెరెమీని చాన్సలర్‌గా నియమించారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటం కష్టతరమైనదని, కానీ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధిని పునరుద్ధరణతో పాటు ప్రజల ఉద్యోగాలు, రుణాలు, బిల్లులపై మొదట దృష్టి సారిస్తామని హంట్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. సునాక్ విధేయుడు కానప్పటికీ... జేమ్స్ క్లావర్లీని విదేశాంగ కార్యదర్శిగా కొనసాగించాలని ప్రకటించడం గమనార్హం. బోరిస్ జాన్సన్ హయాంలో ఉప ప్రధాని, న్యాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరో అనుయాయుడు డొమ్నిక్ రాబ్ అవే బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో సన్నిహితుడు రాబ్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం.










