కోల్‌కతా : విద్వేషపూరిత రాజకీయాలతో కొందరు దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని.. కానీ దేశాన్ని విభజన కానివ్వనని అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం కోల్ కతాలోని రెడ్ రోడ్‌లోని మసీదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఏకం కావాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మితవాద బిజెపి పార్టీని గద్దెదించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అందుకే దేశంలో ఎన్‌ఆర్‌సిని ప్రవేశపెట్టారని .. కానీ పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సి అమలును తాను అనుమతించబోనని స్పష్టం చేశారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి.. ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని.. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని.. కానీ దేశాన్ని విభజన కానివ్వన్నారు.
రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేస్తున్నానని.. కేంద్ర ఏజెన్సీలతోనూ ఫైట్ చేస్తున్నానని.. తనలో ధైర్యం ఉంది కాబట్టి పోరాడుతన్నానని ఆమె చెప్పారు. వారికి తల వంచేది లేదని అన్నారు. బిజెపి నుండి కొందరు డబ్బులు తీసుకుని.. ముస్లిం ఓటర్లను చీల్చుతారని కొందరంటుంటారని.. బిజెపి కోసం ముస్లిం ఓట్లను చీల్చే ధైర్యం వాళ్లకు లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని మార్చేశారని, చరిత్రను కూడా మార్చే వేసేందుకు కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విభజన శక్తులకు వ్యతిరేకంగా మనమందరం సంఘటితమై పోరాడతామని వాగ్థానం చేద్దామని ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే.. ప్రజలంతా విఫలమైనట్లేనని హెచ్చరించారు.










