Jul 18,2021 15:11

రంగారెడ్డి : తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ మారతారని జరుగుతోన్న ప్రచారం ఆయన స్పందించారు. తాను టిఆర్‌ఎస్‌ను వీడుతున్నానని తన ప్రత్యర్థి వర్గం చేస్తున్న ప్రచారం నిజం కాదని, టిఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డితో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం మహేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మహేందర్‌రెడ్డి 2014లో టిడిపికి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు.