Jul 18,2021 20:39
అనంతపురం జిల్లా కదిరిలో రోడ్డుపై వర్షపు నీటి ఉధృతి

ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు చోట్ల వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొర్లి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప జిల్లాలో వాగులో యువకుడు గల్లంతయ్యాడు. కడప జిల్లాలో రెండు రోజూ వర్షాలు కొనసాగాయి. వల్లూరు మండలం దిగువపల్లి గ్రామ సమీపాన ఉన్న వాగులో కొట్టుకుపోయి వీరశెట్టి సుధాకర్‌ అనే యువకుడు గల్లంతయ్యారు. వేంపల్లె సమీపంలోని ఎద్దులకొండకు నెల్లూరు జిల్లా పోదలకూరుకు చెందిన కొండయ్య అనే వ్యక్తి తన పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించేందుకు 50 మంది బంధువులను, స్నేహితులను తీసుకుని బస్సులో వెళ్లాడు. పాపాగ్ని నది అవతలి గట్టులో ఉన్న కొండపైన ఇరుక్కుపోయారు. దేవస్థానం చైర్మన్‌ జయచంద్రారెడ్డి చొరవ తీసుకొని వారిని సురక్షితంగా వేంపల్లెకు చేర్చారు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరులో భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లా కదిరిలో ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంటి ముందు నిలిపిన కొన్ని ద్విచక్ర వాహనాలు వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. ఒడిస్సీ మండలం మిట్టపల్లి బ్రిడ్జి వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు ధ్వంసమైంది. నల్లమాడ మండలం శ్రీ రెడ్డివారిపల్లి గ్రామ సమీపాన ఉన్న చెరువులో నీటి ప్రవాహానికి మందలోని దాదాపు 200 గొర్రెలు చనిపోయాయి. కదిరి, లేపాక్షి, ఎన్‌పికుంట, అమడగూరు, చిలమత్తూరు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. కర్నూలు జిల్లాలోని 31 మండలాల్లో వర్షాలు పడ్డాయి. పగిడ్యాల మండలంలో 58.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నం, మంగిననపూడి, హంసలదీవి వద్ద బీచుల్లో అలల ఉధృతి తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో భారీ వర్షానికి నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పలుచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం
కృష్ణా, గోదావరి నదీపరివాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదుల్లో వరద ప్రవాహం మొదలైంది. గోదావరిలో 1,51,817 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లలో శ్రీశైలంలోకి 53,307 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఆల్మట్టిలోకి 52,247 క్యూసెక్కులు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువన నారాయణపూర్‌లోకి వదులుతున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 60,185 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 54,080 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. జూరాల డ్యామ్‌లోకి 68,179 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 56,767 క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 57,127 క్యూసెక్కులు వస్తోంది. నాగార్జునసాగర్‌లోకి 5,465 క్యూసెక్కులు, పులిచింతలలోకి 12,291 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజిలోకి 7147 క్యూసెక్కులు వరద వస్తోంది.

వాతావరణ హెచ్చరికలు ఇలా...
రాష్ట్రంలో ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.