ప్రజాశక్తి - విజయవాడరూరల్ : అకాల వర్షాలకు తడిసిన పైరు పంటలైన జొన్న, మొక్కజొన్న, ధాన్యం ను రైతు భరోసా కేంద్రం ద్వారా నేరుగా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. విజయవాడ రూరల్ లోని నున్న లో ఆర్ బి కె ఎదుట బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు అఖిలపక్షం గా ఏర్పడి ఈ ఆందోళన నిర్వహించారు. గత నాలుగు రోజులు గా కురిసిన వర్షాలకు విజయవాడ రూరల్ మండలం నున్న, పాతపాడు, పి. నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లో ధాన్యం, జొన్న, మొక్కజొన్న ముద్దవడంతో పాటు మొలకలు వచ్చాయని రైతులు ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కలకోటి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మాదు శివరాం ప్రసాద్,గుంటక సుబ్బారెడ్డి,గంపా శ్రీనివాస్ యాదవ్, బొకినాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.










