Feb 14,2023 22:09

ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి మడకశిర : తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యనుమ పరిష్కరించాలని నగర పంచాయతీ పరిధిలోని చీపులేటి గ్రామానికి చెందిన మహిళలు ఖాళీబిందెలతో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు అనుమక్క, తిప్పమ్మ, పద్మ, నాగమణి తదితరులు మాట్లాడుతూ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ తాము నెల రోజులుగా నీటి కోసం తీవ్రఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను మున్సిపల్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తమ సమస్య పరిష్కారం చేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై బైటాయించారు. దీంతో మడకశిర హిందూపురం ప్రాంతాలకు రాకపోకలు స్థంబించిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మహిళలకు నచ్చే చెప్పడానికి ప్రయత్నించగా వారు తమ సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని బీష్మించుకు కూర్చొన్నారు. చివరకు మున్సిపల్‌ ఎఒ మురళి సంఘటనాస్థలానికి వచ్చి మహిళలతో మాట్లాడారు. విద్యుత్‌ సరఫరాలోని లోపం మూలంగా మోటర్‌ దెబ్బ తినిందని 24 గంటల్లో మరమ్మతులు చేసి నీటి సరఫరా సక్రమంగా అందజేస్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.