(ప్రజాశక్తి స్పోర్ట్స్‌డెస్క్) : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌ను తప్పించడమేనని విశ్లేషకులు అంటున్నారు. వీరిద్దరి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌లకు చోటు కల్పించి సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ మంచిపని చేసిందని వారంటున్నారు. ఓపెనర్‌గా వచ్చిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్(33; 25బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్)తో అలరించగా.. గ్లెన్ ఫిలిప్(25; 7బంతుల్లో, ఫోర్, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 2021 నుంచి సన్‌రైజర్స్ తరఫున కేవలం 5మ్యాచులే ఆడిన గ్లెన్ ఫిలిప్స్.. సరైన సమయంలోనే ఫామ్‌లోకి వచ్చాడని వారంటున్నారు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కేవలం రూ.20లక్షల బేస్‌ప్రైజ్‌కు కొనుగోలు చేయగా.. గ్లెన్ ఫిలిప్ 2021 నుంచి రూ.1.50కోట్ల ధరతోనే సన్‌రైజర్స్‌లో కొనసాగుతున్నాడు. ఇక సన్‌రైజర్స్ ప్రాంచైజీ 2023 మినీ వేలంలో హారీ బ్రూక్‌ను రూ.13.25కోట్లకు, మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. వీరిద్దరి ఆటగాళ్ల కొనుగోలుకే సుమారు రూ.20కోట్లకు పైనే ఖర్చుచేసింది. ఇక హారీ బ్రూక్ ఈ సీజన్‌లో 9మ్యాచ్‌లు ఆడి 163పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ పోగా.. మిగిలిన 63పరుగులను 8మ్యాచుల్లో కొట్టాడు. ఇక మయాంక్ అగర్వాల్ 9 ఇన్నింగ్స్‌లో 187పరుగులే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 49పరుగులు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రాబోయే మ్యాచ్‌లకు వీరిద్దరినీ బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- సందీప్‌కు పీడకలగా నోబాల్: లక్ష్మీపతి బాలాజీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌జట్టు 4వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక రాజస్తాన్ ఆటగాళ్లు విజయం సాధించామని సంబరపడినా ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. చివరి బంతి 'నో బాల్' వేసి మరీ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌కు అప్పగించిన బౌలర్‌గా సందీప్ శర్మ నిలిచిపోయాడు. ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతిని హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సిక్స్‌గా మలిచాడు. గతంలో చెన్నైపై చివరి ఓవర్‌లో తక్కువ పరుగులను కాపాడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సందీప్ శర్మ.. ఈసారి మాత్రం ఆర్‌ఆర్ ఓడిపోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ క్రమంలో సందీప్ శర్మకు టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ మాట్లాడుతూ.. అతని జీవితంలో మాత్రం సందీప్ ఈ నో బాల్‌ను మరిచిపోలేడని పేర్కొన్నాడు.










