ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్ డి ఆదినారాయణ, నాయకులు యు రామస్వామి, వరసాల శ్రీనివాసరావు, కె రాజబాబు అన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి 970వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ఎఫ్‌ఎండి, ఇఎండి, ప్లాంట్ డిజైన్, ఇ అండ్ ఎండి విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఉక్కు సంకల్పంతో కార్మికులు ముందుకు సాగుతున్నారన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మౌనం వహించడం దారుణమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి ఇప్పటికైనా మోడీ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు అన్ని పార్టీలూ సిద్ధపడాలని కోరారు. ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షలో ఉద్యోగులు శ్రీనివాస్, బిఎస్ చలపతిరావు, సిహెచ్ వెంకటరావు, పిజికె రాజు, వి బాలకృష్ణ, ఎవి ప్రకాష్, డి మధు, రాజేష్, జి ఆనంద్ పాల్గొన్నారు.










