Oct 09,2023 15:35

ప్రజాశక్తి-గోకవరం : సంత మార్కెట్ వేలం వద్దు- చిరు వ్యాపారుల పొట్ట కొట్టొద్దని సంత మార్కెట్ వ్యాపారస్తులు నిరసనలు చేపట్టారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో సంత మార్కెట్ వ్యాపారులు మార్కెట్ నందు భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు విలేకరులతో మాట్లాడుతూ గత 100 ఏళ్లగా ఈ సంత మార్కెట్ లోనే చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కొట్టులు పెట్టుకొని వ్యాపారంగా జీవనం సాగిస్తున్నారని, స్థానిక గ్రామపంచాయతీ అధికారులు మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి ఉన్న షెడ్లను తొలగించి నూతనంగా స్లాబ్ లతో కూడిన షాపు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. హఠాత్తుగా సంత మార్కెట్ వ్యాపారస్తులకు ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా సంత మార్కెట్ షెడ్లకు వేలం పాటలు పెట్టడానికి నిర్ణయించుకున్నారని తెలియడంతో ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేదని తెలిపారు, ఈ సంత మార్కెట్లో నిర్మించే ఒక్కో షాపుకి అడ్వాన్స్ గా 2లక్షల రూపాయలు కట్టిన వారికే షెడ్లు ఇస్తామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ చిరు వ్యాపారస్తులు 2లక్షల రూపాయల కట్టే స్తోమత లేదని అధిక భారం పడుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంత మార్కెట్లో 100 సంవత్సరాల నుండి ఆశీలు మా తాతలు దగ్గర నుండి కడుతూనే ఉన్నామని, మరలా రెండు లక్షల రూపాయల కట్టమని చెప్పడం అన్యాయం అన్నారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు మా చిరు వ్యాపారస్తులకు యధావిధిగా మా షెడ్లు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ వారిని కలిసి విన్నవించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుని వివరణ కోరగా సంత మార్కెట్ నూతన షెడ్లు నిర్మాణంపై షెడ్లు వేలం పాటకు సంబంధించిన సమాచారం గత వారం రోజులుగా మైక్ లో అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని, మార్కెట్ షెడ్లు కు సంబంధించి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. సంత మార్కెట్ వ్యాపారులు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశ పరిచి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంత మార్కెట్ చిరు వ్యాపారస్తులు మహిళలు పాల్గొన్నారు.