Mar 27,2023 16:25

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మండలంలోని కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం పూర్తి కాకముందే రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు మానిటరింగ్ కమిటీ వేసినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు దానిని అమలు చేయడంలో విఫలమయ్యారని   తెలిపారు. పరిమితికి మించి తరగతి గదిలో విద్యార్థులను ఉంచుతున్నారని, పిల్లల ఆటవిడుపుకు కనీసం క్రీడా మైదానం కూడా లేదని ఆరోపించారు. ఫంక్షన్ల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని  తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వీటిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు యుగేందర్, హేమంత్, సాయి, ఇస్మాయిల్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.