ప్రజాశక్తి-పీలేరు: 2023 ఫిబ్రవరి 5న 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.రంగనాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎన్.భానుశేఖర్ రెడ్డి 116 మార్కులతో జిల్లా స్థాయిలో 5వ స్థానం, కె. హితేష్ 110 మార్కులతో జిల్లా స్థాయిలో 9వ స్థానంతో జనరల్ కేటగిరిలో ఎంపికయ్యారన్నారు. వీరికి సంవత్సరానికి రూ.12,000లు చొప్పున 9వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్లపాటు ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యాసంవత్సరంలో మరింత ఎక్కువ మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు అర్హత సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.










