Jan 02,2023 15:17

న్యూఢిల్లీ  :   సీనియర్‌ జర్నలిస్ట్‌ సీమా చిస్తీ 'ది వైర్‌' ఎడిటర్‌గా సోమవారం నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె వైర్‌కి చెందిన ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ వార్తాపత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. 'దివైర్‌' వ్యవస్థాపకులు సిద్థార్థ వరదరాజన్‌, ఎం.కె. వేణు, సిద్థార్థ్‌ భాటియాలు సోమవారం ఈ మేరకు ప్రకటించారు. జర్నలిస్ట్‌గా అపార జ్ఞాన సంపద, అనుభవంతో మన సంస్థను మరింత ముందుకు తీసుకువెళుతుందని పేర్కొన్నారు. మీడియా రిపోర్టింగ్‌, కవరేజీకి విలువైన సహకారం అందించడమే కాకుండా దేశంలో మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ధీటుగా స్పందిస్తారని తాము విశ్వసిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఆమె వైర్‌కి చెందిన ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ ఎడిషన్ లకు   ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. సీమా చిస్తీ రిపోర్టర్‌గా, రచయితగా, పరిశోధకురాలిగా, విద్యావేత్తగా, బ్రాడ్‌కాస్టర్‌గా, దశాబ్దాల అనుభవంతో ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 సంస్కరణలు, బాబ్రీ మసీదు కూల్చివేతతో పాటు గత మూడేళ్లలో భారత్‌లోని అన్ని ప్రధాన సమస్యలపై పలు విస్తృత నివేదికలు అందించారు. ముఖ్యంగా స్వతంత్ర రచయితగా పనిచేయడంతో పాటు ఆమె రాసిన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ప్రసారమయ్యాయి. ఇండియన్‌ కేబుల్‌ వార్తా లేఖ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆమె... ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో 14 ఏళ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. ప్రముఖ వార్తా సంస్థ బిబిసికి కూడా తన సేవలు అందించారు. బిబిసి వరల్డ్‌ సర్వీస్‌కి చెందిన హిందీ, ఢిల్లీ బ్యూరో హెడ్‌గా, ఎడిటర్‌గా కొనసాగారు. చిస్తీ జెఎన్‌యు నుండి మాస్టర్స్‌ డిగ్రీతో పాటు ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు.