హిందూపురం : పురపాలక సంఘం నూతనంగా నిర్మించిన వాణిజ్య, కూరగాయల మార్కెట్ సముదాయ భవనం కింద భాగంలో పూల వ్యాపారులకు స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని రాజకీయ పార్టీల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు స్థలం కేటాయించాలని కోరుతూ గురువారం స్థానిక మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు పూల వ్యాపారులతో కలిసి నాయకులు ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత మార్కెట్ ఉన్న సమయంలో పూల మార్కెట్ అదే ఆవరణలో ఉండేదన్నారు. నూతన మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత మార్కెట్‌ను తొలగించినప్పుడు, పూల వ్యాపారులందరికీ నూతన మార్కెట్‌లో స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదన్నారు. దీంతో పాటు పశువర్ధక శాఖ అధీనంలో ఉన్న స్థలంలో తాత్కాలిక మార్కెట్ నిర్వహిస్తుంటే వారు సైతం ఖాళీ చేయించారని వాపోయారు. మార్కెట్ నిర్వహణకు స్థలం లేక పూల వ్యాపారులు రోడ్డున పడ్డామన్నారు. కావున నూతన మార్కెట్ కింద ఖాళీ స్థలాన్ని కేటాయించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణ, కాంగ్రెస్ శ్వామ్‌కిరణ్, ఆర్‌సిపి శ్రీనివాసులు, బిఎస్‌పి శ్రీరాములు, ఎంఐఎం మున్నా, వివిధ పార్టీల నాయకులు హరి, కలీం, కృష్ణప్ప, ఫిరోజ్, శ్రీనివాస్, పూల వ్యాపారులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న పూల వ్యాపారులు










