Feb 09,2023 22:32

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసిన సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు

          పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాగి మాల్ట్‌ పంపిణీ చేసేందుకు సత్యసాయి ట్రస్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ట్రస్టు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌తో పాటు సభ్యులు గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని సిఎం క్యాంపు కార్యాలయంలో కలిసి పౌష్టిక ఆహారమైన రాగి మాల్ట్‌ను సరఫరా చేయడానికి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజనంతోపాటు రాగి మాల్ట్‌ అందిస్తే విద్యార్థుల హాజరు పెరుగుతుందని భావించి సత్యసాయి ట్రస్టును కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, డీఈవో సంప్రదించారు. ఈ విషయాన్ని గత నెల జనవరి 11న ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదిక మేరకు ట్రస్టు ప్రతినిధులతో పాటు కలెక్టర్‌ ముఖ్యమంత్రిని కలసి బెల్లం, రాగి పిండి కలిపిన రాగి మాల్ట్‌ అందించడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44,392 పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు రాగి మాల్ట్‌ అందించనున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలోని 679 మండలాల్లో ఈ బహత్తర కార్యక్రమాన్ని చేపట్టేలా సత్యసాయి ట్రస్టు ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవాసమితుల ద్వారా దీనిని అందించేలా ట్రస్టు చర్యలు తీసుకుంది.