Feb 17,2022 07:00

సైన్స్‌ ఎప్పుడూ వాస్తవాలపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకాల ఆధారంగా మనుగడ సాగిస్తుంది. మధ్య యుగం వరకు మతం ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మతాల పేరుతో వివిధ వర్గాల వారు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. మతాధిపతులు రాజులను కూడా నియంత్రణ చేసేవారు.
   15వ శతాబ్దంలో యూరప్‌ లో అనేక మంది శాస్త్రవేత్తలు మత భావనలకు విభిన్నమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వారు ఇందుకు తగిన రుజువులను చూపించారు. ఇందులో గెలీలియో, బ్రూనో, కోపర్నికస్‌ అగ్రగణ్యులు. ఈ క్రమంలో వీరు మతవాదుల నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. గెలీలియో జైలు శిక్ష అనుభవించగా, బ్రూనో ఏకంగా దారుణంగా హత్యకు గురయ్యాడు.
   మత గ్రంథాలలో చెప్పిన విషయాలకు విరుద్ధమైన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు క్రైస్తవ మత పెద్దలు ఆయనను సజీవ దహనం చేశారు. ఆయన కూడా క్రైస్తవ సన్యాసే కానీ...క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మలేదు. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకెన్నో ఉంటాయని చెప్పాడు. విశ్వం అనంతం అన్నాడు.
   1548లో ఇటలీలో జన్మించిన బ్రూనో...కోపర్నికస్‌ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో మతగురువుగా అభిషిక్తుడైనప్పటికీ, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశీలనలను, పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవని మత బోధకులు భావించి, బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసు నమోదు చేశారు. 1593లో గాలి, వెలుతురు చొరబడని ఒక కారాగృహంలో బ్రూనోను బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో ఆయన సుమారు ఏడు సంవత్సరాలకు పైగా వున్నాడు.
    ప్రతిరోజూ మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోను మత ద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి, ఒక్క రక్తంబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణశిక్షకు ఆదేశాలు జారీ చేశారు. 1600 ఫిబ్రవరి 17వ తేదీన...మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంకెళ్ళతో బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, నరకయాతన చూపించి బ్రూనోను సజీవ దహనం చేశారు.
     శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో కూడా మతోన్మాదులు సైన్స్‌వాదులపై దాడులు చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడడంలేదు. ఎవరు ఏం తినాలి, ఏ దుస్తులు వేసుకోవాలి అనే విషయాలపై కూడా ఆంక్షలు పెడుతున్నారు. బ్రూనో వంటి త్యాగధనుల స్ఫూర్తితో నేటి సైన్స్‌వాదులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
                                                           - యం. రాం ప్రదీప్‌,    సెల్‌ : 9492712836