Jul 07,2021 06:17

    గిరిజన హక్కుల కార్యకర్త, క్రైస్తవ సన్యాసి స్టాన్‌స్వామి జ్యుడిషియల్‌ కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరం. సామాజిక శాస్త్రం, తర్కశాస్త్రంలో అపార పరిజ్ఞానం కలిగిన ఈ 84 ఏళ్ల కార్యకర్త పేదరాష్ట్రమైన జార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతంలో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేసిన మంచి వ్యక్తి స్టాన్‌స్వామి. అటువంటి వ్యక్తిని రాజ్య ఉగ్రవాదం, న్యాయవ్యవస్థ నిర్లక్ష్యం కలసికట్టుగా బలిగొన్నాయి. మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడల వికృతత్వానికి ఇదొక సంకేతం. ఇరవై రెండేళ్ల క్రితం ఒడిషాలో క్రైస్తవ మతబోధకుడు గ్రాహం స్టెయిన్స్‌ను, ఆయన ఇద్దరు కుమారులను సజీవదహనం చేసిన హిందూత్వ శక్తులకు ప్రతినిధిగా ఉన్న మోడీ ప్రభుత్వ ఫాసిస్టు తరహా పోకడలే ఇప్పుడు స్టాన్‌ స్వామి ప్రాణాలను హరించాయి.
    బీమా కొరెగావ్‌ కుట్ర కేసుతో ప్రమేయముందంటూ గతేడాది అక్టోబరు 8న క్రూరమైన ఉపా చట్టం కింద స్టాన్‌స్వామిని ఎన్‌ఐఎ అరెస్టు చేసి 'ఉగ్రవాది', 'మావోయిసు'్ట అని ముద్ర వేసింది. ఎలాంటి విచారణ లేకుండా తొమ్మిది నెలలుగా జైలులో పెట్టి రకరకాలుగా వేధించింది. అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించిన మూడు వేల మంది జార్ఖండ్‌ యువ ఆదివాసీల విడుదలకు పోరాడడం, గో గూండాల మూకదాడుల నుంచి, దురాక్రమణలు, వ్యాపారుల దోపిడీ నుంచి గిరిజనులను రక్షించి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా నిలవడమే ఈ క్రైస్తవ సన్యాసి చేసిన నేరం. బీమా కొరెగావ్‌ను ఎన్నడూ సందర్శించని స్టాన్‌స్వామిని ఆ కేసులో కుట్రదారుడిగా పేర్కొనడమే పెద్ద కుట్ర. మాల్‌వేర్‌ సాయంతో క్రైస్తవ మత బోధకుడు, దళిత హక్కుల కార్యకర్త సురేంద్ర గాడ్లింగ్‌ను బీమా కొరెగావ్‌ కేసులో అరెస్టు చేయడానికి ముందు రెండేళ్ల పాటు ఆయన కంప్యూటర్‌లో కల్పిత రహస్య పత్రాలను దొంగచాటుగా ఎలా చొప్పించిందీ అమెరికన్‌ ఫోరెన్సిక్‌ సంస్థ పరంపరగా వెల్లడిస్తున్న వివరాలు ఈ కుట్ర వెనక ఉన్న హిందూత్వ శక్తుల పాత్రను తెలియజేస్తున్నాయి. పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడే సామాజిక ఉద్యమకారులను దేశ ద్రోహులుగాను, జాతి వ్యతిరేకులుగానూ చూపి అణచివేసేందుకు కేంద్రంలోని మితవాద ప్రభుత్వం ఎంతకైనా బరితెగిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు జెఎన్‌యు విద్యార్థి నాయకులు నటాషా నర్వాల్‌, దేవాంగనా కలితా, అసిఫా తన్హాలపై కూడా ఇలాగే దేశ ద్రోహచట్టం కింద అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టింది. స్టాన్‌స్వామి బెయిలు కోసం పదే పదే చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు, హైకోర్టు నిర్దయగా తోసిపుచ్చాయి. తలోజా జైలులో ఖైదీల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కోవిడ్‌ ప్రబలే ప్రమాదముందని,తనను తలోజా జైలు నుంచి వేరే జైలుకు మార్చాలని హక్కుల కార్యకర్త మొరపెట్టుకుంటే దానిని కూడా ఎన్‌ఐఎ తిరస్కరించింది. కోవిడ్‌ను సాకుగా చూపి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారంటూ స్టాన్‌స్వామిపై అభాండాలు వేసింది. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ చివరికి కదలలేని పరిస్థితి వచ్చింది. అవసరమైన సిప్పర్‌, స్ట్రాలను అందివ్వడానికి జైలు అధికారులు నిరాకరించారు. వాటికోసం చివరికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే జైళ్ల వ్యవస్థ ఎంత అమానవీయంగా ఉందో అర్థమవుతుంది. అన్ని అవయవాలు చచ్చుపడిపోయి కదల్లేని స్థితిలో ఉన్న ఈ వృద్ధ కార్యకర్త ఆరోగ్య పరిస్థితి చూశాక కూడా బెయిలు మంజూరుకు న్యాయాధీశులు తిరస్కరించడం న్యాయవ్యవస్థకు మాయని మచ్చ. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారాక ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కోర్టు ఆదేశించింది. 'న్యాయాన్ని జాప్యం చేయడం న్యాయాన్ని తిరస్కరించడమే' అన్న నానుడిని అది మరోసారి నిజం చేసింది. కోర్టు సకాలంలో స్పందించి ఉంటే స్టాన్‌స్వామి ప్రాణాలు కాపాడబడేవి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం, ఎన్‌ఐఎ అధికార దుర్వినియోగం, న్యాయవ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఉదాసీనత కలసికట్టుగా స్టాన్‌స్వామి ఊపిరి తీశాయి. ఇది ముమ్మాటికీ వ్యవస్థాగత హత్యే !
   మోడీ ప్రభుత్వ ఈ అమానవీయ చర్యపై దేశీయంగానే గాక, అంతర్జాతీయంగానూ తీవ్ర నిరసనాగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతిని అణచివేసేందుకు క్రూరమైన చట్టాల కింద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధించిన రాజకీయ, ఇతర ఖైదీలనందరినీ బేషరతుగా విడుదలజేయాలి. స్టాన్‌స్వామి మృతికి కారకులైన వారిని బోనులో నిలబెట్టాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. లేకుంటే నియంతృత్వ కోరల్లో దేశం చిక్కుకునేే ప్రమాదముంది.