ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్రం నుండి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమచేయాలని, లేనిపక్షంలో ఈ నెలాఖరు నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారిని సంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి టి కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు ఉయ్యూరు అప్పిరెడ్డి, పూల నాగమణి, లలితకుమారి, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు వీరాంజనేయులు ఉన్నారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి 50 రోజులు అవుతున్నా పంచాయతీలకు విడుదల కాలేదని తెలిపారు. ముఖ్యంగా కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాలకు సంబంధం లేకుండా నేరుగా పంచాయతీలకు ఇచ్చే విధంగా చూడాలని కమిషనర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. కేంద్రం నుండి రావాల్సిన రూ.988 కోట్లను కూడా రెండో విడత విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కమిషనర్‌కు వివరించారు. ముఖ్యంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచులకు పెండింగ్ పడిన వేతన బకాయిలనూ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామాల్లో పనులు చేయలేని స్థితిలోకి వెళ్లారని పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులమైనా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దీనిపై సిఎంఒ అధికారులను కూడా కలిశామని, నిధులు ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారని పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో సర్పంచులు ఎం సాంబశివరావు, అశోక్‌కుమార్, జైరామ్‌రెడ్డి, ఎం శ్రీనివాసరావు, సాంబశివరావు, బజ్జన్న, సుబ్బారావు తదితరులు ఉన్నారు.










