Jul 03,2021 06:58

   మాజ పురోగమనానికి కళ శక్తివంతమైన ఆయుధం. ఆ కళకు ప్రతిబంధకాలు సృష్టించి అడ్డుకోవడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడంతో పాటు సమాజ పురోగమనాన్ని కూడా అడ్డుకోవడమే అవుతుంది. చలన చిత్రాల సెన్సార్‌షిప్‌కు సంబంధించిన సినిమాటోగ్రఫి చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ఈ కోవలోనివే. సినిమాలను సర్టిఫై చేసి ప్రజా బాహుళ్యంలో ప్రదర్శనకు అనుమతించేందుకు స్వతంత్ర వ్యవస్థగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబిఎఫ్‌సి) పనిచేస్తోంది. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఈ బోర్డు స్వతంత్రతను నాశనం చేసి దానిస్థానంలో తన పెత్తనం చెలాయించాలని పరితపిస్తోంది. ప్రధానంగా సెన్సార్‌ బోర్డు పరిశీలించి ధ్రువీకరించిన చిత్రాలను తిరిగి పునఃపరిశీలించే (రివిజనరీ) అధికారాన్ని తనకు దఖలు పర్చుకునేందుకు సవరణ చేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ తిరోగమన వైఖరికి నిదర్శనం. పార్లమెంటులో సంఖ్యాబలంతో సినిమాటోగ్రఫి (సవరణ) బిల్లు - 2021 యధాతథంగా అమల్లోకి వస్తే ఇక సెన్సార్‌ బోర్డు ఉన్నా.. లేనట్టే. ఇదే మోడీ సర్కార్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను రద్దు చేసింది. ఇక మిగిలిన సిబిఎఫ్‌సిని కూడా నాశనం చేసే కుతంత్రానికి ఇప్పుడు తెర లేపింది.
    వాస్తవానికి ప్రస్తుతమున్న సెన్సార్‌ బోర్డే మితవాద ధోరణులతో ప్రగతిశీల, అభ్యుదయ చిత్రాలను ఎన్నింటినో అనేక ఆంక్షలతో అడ్డుకొని కత్తిరింపులతో సృజనాత్మక రూపును చిధ్రం చేస్తూవస్తోంది. ప్రధానంగా రాచరిక, భూస్వామ్య వవ్యస్థల అవశేషాలుగా మిగిలిపోయిన అనాచారాలను, మూఢత్వాలను ప్రశ్నించే ప్రగతిశీల చిత్రాల విముక్తి కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్బాలు కోకొల్లలు. ఇప్పుడు ఈ స్వతంత్ర వ్యవస్థ స్థానంలో ఏకంగా రాజ్యమే ధ్రువీకరణలను పరిశీలించే అధికారం అంటిపెట్టుకుంటే ఇక ప్రగతిశీల భావాలతో తెరకెక్కే చిత్రాలకు ఆస్కారమే ఉండదు. మోడీ సర్కార్‌ ప్రతిపాదిస్తున్న రివిజనరీ సవరణతో ఇప్పటికే సెన్సార్‌ అయిన చిత్రాలను కూడా నిలిపేసే ప్రమాదముంది.
గతంలో ప్రముఖ దర్శకులు నందితాదాస్‌ తెరకెక్కించిన 'వాటర్‌', దిగ్గజ నటుడు కమలహాసన్‌ నటించిన 'గాంధీ' చిత్రాలకు ఎంతగా అడ్డంకులు సృష్టించారో తెలిసిందే. మతతత్వ భావాలను కార్పొరేటీకరించి బాబాలు ఎంతగా దోపిడి సాగిస్తున్నారో దర్పణం పట్టిన 'పికె' చిత్రం తర్వాత బాలివుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ మతోన్మాద శక్తుల నుంచి ఎన్ని బెదిరింపులకు గురయ్యారో చూశాం. హిందూత్వ శక్తుల నేతృత్వంలో మితవాద, కులవాద గ్రూపులు తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే, లేదా తమకు నచ్చని సినిమాలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మూక సెన్సార్‌షిప్‌ (మాబ్‌ సెన్సార్‌షిప్‌)ను ప్రోత్సహించాలన్నదే కేంద్రం తపన. సెన్సార్‌ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరించే ఏర్పాటు లేదంటూ అందుకే వాదిస్తోంది. చట్టంలోని సెక్షన్‌ 5 బి (1) (సినిమాలను సర్టిఫై చేయడంలో మార్గదర్శక సూత్రాలు) ఉల్లంఘన జరిగితే రివిజనరీ (పునఃపరిశీలన) అధికారాన్ని పొందేందుకు ఒక నిబంధనను జోడించాలని సవరణ ప్రతిపాదిస్తోంది. అంటే ఇప్పటికే సర్టిఫై అయిన సినిమాలను కూడా ఈ నిబంధన సాకుతో వెనక్కి తీసుకొని, వాటిని ఆపేసే అధికారాన్ని దక్కించుకోవడం అన్నమాట. ఇదే జరిగితే ప్రభుత్వ వినాశకర సిద్ధాంతానికి వ్యతిరేకంగా, విమర్శనాత్మకంగా ఉండే సినిమాలను జనాలు చూసేవీలుండదు.
    వాస్తవానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫై చేసినా వాటిని న్యాయస్థానాల్లో సవాలు చేసే అధికారం ప్రతి పౌరునికి ఉంది. అందువల్ల ఆ సాకు చెప్పి ప్రభుత్వమే సెన్సార్‌షిఫ్‌ అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటామంటే ఎలా? అది కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేయడమే. సినీ దర్శక నిర్మాతల సృజనాత్మక ప్రతిభ, రాజ్యాంగ హక్కుగా ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేయడమే.
     స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పరిగణించే ఎమెర్జెనీకి ఇటీవల 46 ఏళ్లు నిండిన సందర్భంగా మోడీ ఒక ఉదాత్తమైన ప్రకటన చేశారు. వ్యవస్థలను నాశనం ఎలా చేశారనేదానికి 1975-77 ఎమర్జెన్సీ కాలం సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. బహుశా ఎమర్జెన్సీ రోజులను మోడీ సర్కార్‌ బాగానే ఆకళింపు చేసుకున్నట్లు ఉంది. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రకటించి అత్యయిక స్థితి అమల్జేస్తే ఇప్పటి మోడీ సర్కార్‌ అప్రకటిత ఎమర్జెన్సీతో వ్యవస్థలను నాశనం చేస్తోందన్నది వాస్తవం. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడికి వ్యతిరేకంగా ధైర్యంగా గొంతు వినిపిస్తున్న చలనచిత్ర పరిశ్రమకు ప్రజల మద్దతు అవసరం.