ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి కార్మికుడూ సన్నద్ధం కావాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గాంధీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పర్మినెంట్ సిబ్బందితోపాటు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల రోజువారి పనికి సంబంధించిన హాజరు, ఎపి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు మన జీతాలకే గాక ఉద్యోగాలకు కూడా ఎసరుపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని ఎదుర్కొనే హామీలు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పోరాటానికి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులందరూ సన్నద్ధం కావాలన్నారు. ఈనెల 16న మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ప్రదర్శనతో నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయినా స్పందించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష, కార్యద్శులు ఆదినారాయణ, అయూబ్బాన్, సత్యసాయి జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, లక్ష్మీనారాయణ, ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు రఫీ, పట్టణ మున్సిపల్ పారిశుధ్య కార్మికసంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సమావేశమైన మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు










